బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 17 మార్చి 2022 (23:33 IST)

నూతన డిజైన్లతో సరికొత్త చేనేత వస్త్రాలు: పుష్ప శ్రీవాణి

జాతీయ చేనేత ప్రదర్శనలో అమాత్యులు, మహిళా శాసన సభ్యులు సందడి చేసారు. గత రెండు వారాలుగా విజయవాడ నగర వాసులకు దేశంలోని విభిన్న రాష్ట్రాల చేనేత వస్త్రాలను పరిచయం చేస్తున్న ఈ ప్రదర్శన శుక్రవారంతో ముగియనుంది.

 
గురువారం నాటి శాసన సభ సమావేశాల అనంతరం నగరంలోని ఎ ప్లస్ కన్వెన్షన్లో జరుగుతున్న ప్రదర్శనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రంపచోడవరం శాసన సభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి, పాడేరు శాసన సభ్యులు కె.భాగ్యలక్ష్మి తదితరులు అక్కడి వస్త్ర శ్రేణిని చూసి అచ్చెరువొందారు. నూతన డిజైన్లతో సరికొత్తగా ఇక్కడి వస్త్రాలు ఉన్నాయని పుష్ఫ శ్రీవాణి అన్నారు.

 
అందుబాటు ధరలలో ఆధునికత ఉట్టిపడేలా చేనేత వస్త్రాలు లభిస్తున్నాయని తానేటి వనిత పేర్కొన్నారు. చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు ఈ ప్రజాప్రతినిధుల బృందానికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్, సంయుక్త సంచాలకులు కన్నబాబు, నాగేశ్వరరావు, ఆప్కో ముఖ్య మార్కెటింగ్ అధికారి లేళ్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.