శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:56 IST)

తెలంగాణలో టైగర్ టెన్షన్.. ఏపీలో పెరుగుతున్న పులుల సంఖ్య

తెలంగాణలో టైగర్ టెన్షన్ మళ్లీ మొదలైంది. కొమురంభీం జిల్లా పెంచికల్ పేట మండలం ఆగర్ గూడలో పులి సంచారం చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఓ రైతుకు చెందిన రెండు ఎద్దులపై పులి దాడి చేయడంతో అందులో ఓ ఎద్దు మృతి చెందగా మరో ఎద్దు తీవ్రంగా గాయపడింది. 
 
అటవీ శాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారాన్ని అందించారు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక భయం గుప్పిటలో ఉన్నారు.
 
మరోవైపు ఏపీలో పులులు పెరుగుతున్నాయి. నాగార్జున సాగర్‌–శ్రీశైలం అభయారణ్యంలో పులుల కారిడార్‌ విస్తరిస్తోంది. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ పులుల సంచారం ఉన్నట్టు అటవీ శాఖ గుర్తించింది. 
 
ఈ అభయారణ్యంలో గతంలో పులులు తిరిగే ప్రాంతం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో మాత్రమే ఉండేది. ఆ మూడు జిల్లాల్లోని నల్లమల అడవుల్లోనే పులులు సంచరించేవి. కొన్నేళ్లుగా ఇవి తిరిగే కారిడార్‌ నల్లమల నుంచి వైఎస్సార్, చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం అడవుల వరకూ విస్తరించింది. తరచూ నిర్వహిస్తున్న పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది.
 
అభయారణ్యం 3,727 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా.. 2,444 చదరపు కిలోమీటర్లు కోర్‌ ఏరియా (కేంద్రీకృత ప్రాంతం)గా ఉంది. గతంలో అభయారణ్యాన్ని మూడు బ్లాకులుగా విభజించారు. పులుల కారిడార్‌ పెరుగుతుండటంతో.. కారిడార్‌ ఏరియాగా నాలుగో బ్లాక్‌ ఏర్పాటు చేశారు.