1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Modified: సోమవారం, 21 జులై 2014 (17:54 IST)

తిరుమల కొండపై... ప్రాణాలు తీస్తున్న వృక్షాలు... కొట్టేస్తున్నారు... అంతేనా...?!!

చెట్లు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అన్నది అందరికి తెలిసిన విషయమే. కానీ, దీనికి విరుద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నినాదం చేపట్టింది. భక్తుల ప్రాణాలు  తీస్తున్నాయన్న కారణంతో వృక్షాలను కూల్చేస్తోంది టీటీడీ. దట్టమైన అడవులు, ఎటూ చూసినా ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుండే ఏపుగా పెరిగిన వృక్షాలతో అలరారుతుంది తిరుమల. వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే వారికి చక్కటి ప్రకృతి అందాలను పంచుతూ చల్లదనాన్నిచ్చేవి ఈ చెట్లే. 
 
ఇటీవలి కాలంలో కొండపై కొన్నిచెట్ల కింద మట్టి కొట్టుకుపోయి వీటిలో కొన్ని నేలకూలి భక్తుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటికే కూలిన చెట్ల కింద పడి భక్తులు చనిపోయారు. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. తిరుమలలో తాజాగా ఓ భారీ వృక్షం జనసమర్థం ఎక్కువగా ఉండే లేపాక్షి సర్కిల్‌లో నేల కూలింది. టాక్సీ డ్రైవర్ తీవ్రగాయాలపాలై మరణించాడు. కొంతమంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. తిరుమలలో చెట్లు కూలి ప్రమాదాలు జరగడం ఇది మొదటిసారి కాదు. 
 
గతంలో లేపాక్షి ఎంపోరియం చెట్టు కూలి తమిళనాడు భక్తబృందంపై పడింది. ఇలా తిరుమలలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భారీ వృక్షాలే ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నేలకూలడానికి మరిన్ని భారీ వృక్షాలు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు.
 
పర్యావరణ సంస్థల మండిపాటు 
వీటి స్థానంలో కొత్త మొక్కలు నాటక ముందే ఇలా తొలగించడం పర్యావరణానికి మంచిది కాదని అధికారులకి చెప్పబోతే కొత్త మొక్కలు నాటడానికి మరికొంత సమయం పడుతుందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. కొత్తమొక్కలు నాటకపోవడంపై వివిధ స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా తొలగించిన మొక్కలకు బదులుగా మరిన్ని కొత్తమొక్కలు నాటాలని డిమాండ్‌ చేస్తున్నారు.