రామానుజ సహస్రాబ్ది వేడుకల కోసం నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సోమవారం అమరావతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళతారు. సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్ శ్రీరామ నగరులో ఉన్న శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రయానికి చేరుకుంటారు.
ఇక్కడ జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన సమతామూర్తి విగ్రహంతో పాటు ఇక్కడ నిర్మించిన 108 దివ్యక్షేత్రాలను సందర్శించి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆయన రాత్రి 8 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి రాత్రి 9.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి వస్తారు.
అలాగే, ఈ నెల 11వ తేదీన కూడా సీఎం జగన్ మరోమారు హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు వివాహానికి ఆయన హాజరవుతారు. సీఎం పర్యటనలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.