తిరుమలలో లొట్టలేసుకుని తినే భోజనం, ఏమి రుచి?
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో వండిన సంప్రదాయ భోజనాన్ని శుక్రవారం టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి స్వీకరించారు. తిరుమల అన్నమయ్య భవనం క్యాంటీన్‌లో టిటిడి గురువారం నుండి వారం రోజుల పాటు సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న విషయం విదితమే.
ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతో తిరుమలలో సంప్రదాయ భోజనాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో తయారుచేసిన ఆహారాన్ని భుజించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా సమయంలో శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి ఆహారంపై చర్చిస్తున్నారని తెలిపారు.
పట్టణవాసులతో పోల్చుకుంటే గ్రామాల్లో సహజసిద్ధంగా లభించే ఆహారం తీసుకునే వారికి వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఈ సందేశాన్ని ప్రజల్లోకి పంపడం, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా గోమాతను రక్షించుకోవడం టిటిడి ముఖ్య ఉద్దేశాలని తెలిపారు. లాభాపేక్ష లేకుండా సంప్రదాయ భోజనాన్ని భక్తులకు అందిస్తామని, ముడిపదార్థాలన్నీ సిద్ధం చేసుకుని శాశ్వత ప్రాతిపదికన దీన్ని అమలుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఈవో వివరించారు.