శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జులై 2020 (09:34 IST)

ఏపీలో పెరిగిన 'మత్తు పదార్థాల' అక్రమ రవాణా

ఏపీలో మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం, మత్తు పదార్థాల రవాణా పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో ఇబ్బడిముబ్బడిగా పట్టుబడుతున్న వైనమే ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తోంది.

ఆఖరికి డిగ్రీ చదువుకునే విద్యార్థులు సైతం ఈ మాదకద్రవ్యాల విక్రయాల్లో నిందితులుగా వుండడం గమనార్హం. ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపడుతున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
భారీగా గుట్కా, గంజాయి డంప్
రోజురోజుకు కరోనా కేసులు నమోదవుతున్న క్ర‌మంలో ఎక్కడ లాక్‌డౌన్ విధిస్తారో అన్న ఆలోచనతో ముందస్తుగా భారీస్థాయిలో డంప్ చేసే ఆలోచనలో గుట్కా మాఫియా  నిమగ్నమైంది.

గత లాక్‌డౌన్ సమయంలో గుట్కా వ్యాపారంలో భారీగా లాభపడిన మాఫియా నందిగామ డివిజన్ పరిధిలోని కంచికచర్లను అడ్డాగా చేసుకొని గుట్కాను భారీగా డంప్ చేయటానికి పూనుకొంది. ఈ నేప‌ధ్యంలో అక్ర‌మ గుట్కా వ్యాపారాన్ని నిరోధించటానికి పోలీసులు సరికొత్త రీతిలో తనిఖీలు మొదలుపెట్టారు.

బడా వ్యాపారులను టార్గెట్ చేస్తూ వారి క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టారు. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబుకు అందిన సమాచారం మేరకు స్థానిక డీఎస్పీ జి.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామ శివారులో గల ఓ విల్లాలో భారీగా డంప్ చేసిన గుట్కాను పోలీసులు గుర్తించారు.

అలాగే కంచికచర్ల పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ పైభాగంలో ఉన్న నివాస గృహంలో భారీగా గుట్కా నిల్వ‌లు ఉన్న‌ట్లు స‌మాచారం అందుకున్న పోలీసులు దాడులు చేప‌ట్టారు. త‌నిఖీలో పట్టుబడిన గుట్కా ప్యాకెట్ల ‌విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు.

ఈ గుట్కాను ఒరిస్సా ప్రాంతం నుండి ఖమ్మం అడ్డాగా మార్చి అక్కడ నుండి రాత్రి వేళల్లో ఖరీదైన కారులో కంచికచర్లకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. రూ.70 లక్షలు విలువైన గుట్కాతో పాటు 10  కేజీల గంజాయి, రూ.13,500 నగదుతో పాటు, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఐదు కార్లు, ఐదు సెల్‌ఫోన్లు సీజ్ చేశామ‌న్నారు.

పదే పదే పోలీసులు చెబుతున్నా వినకుండా గుట్కా వ్యాపారంలో నిమగ్నమై అనేక కేసుల్లో ఉన్న వారిపై ఇప్పటికే కొంతమంది మీద షీట్లు ఓపెన్ చేయడం జరిగిందని, మళ్లీ తిరిగి ఇదే వ్యక్తులు వ్యాపారం కొనసాగిస్తే జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు మేరకు నగర బహిష్కరణ, పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి ఒరిస్సాకు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించి భారీ స్థాయిలో జ‌రుగుతున్న గుట్కా అక్ర‌మ వ్యాపారానికి అడ్డుక‌ట్ట వేసిన నందిగామ రూరల్ సీఐ సతీష్‌, కంచికచర్ల ఎస్సై శ్రీహరి, ఇంటెలిజెన్స్ ఎస్సై ఐ.రమణ అధికారుల‌తో పాటు ఎస్‌బి కానిస్టేబుల్ మాధవరావు, ఎస్‌బి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణస్వామితో పాటు పలువురు సిబ్బందిని ఎస్పీ ర‌వీంద్ర‌బాబు అభినందించి రివార్డులు అందజేశారు.
 
గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న విద్యార్థులు
గుంటూరులో సాంకేతిక పరిజ్ఞానంతో గంజాయి లిక్విడ్ బాటిల్స్ పెట్టి విక్రయిస్తున్న 8 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 8 కేజీల గంజాయి, 30వేల నగదు, 55 గంజాయి లిక్విడ్ బాటిల్స్, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడిన వీరు.. సుమారు ఆరు నెలలుగా ఈ విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
అక్రమ మద్యం పట్టివేత  
గుంటూరు జిల్లా శావల్యపురం మండలము కారుమంచి గ్రామములో ఎక్సైజ్ పోలీసులు 3 వేల 842 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో లారీ, టాటా ఎసి, ఆటో, మూడు బైకులు 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ ఏఐ మాధవి తెలిపారు.

ఇందులో పోలీసు అధికారి పాత్ర ఉందని చెప్పటం విశేషం. 9 మంది నిందితులు శావల్య పురం మండలము కారుమంచి, వైకళ్ళు గ్రామాలకు చెందినవారు.