1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 1 జులై 2015 (12:29 IST)

బాబుతో ఆ నాయకులు దూరం... దూరం.? గవర్నర్ విందులో టీ నేతలు

వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఏపీ-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ విందు ఇచ్చారు. మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దూరంగా ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు కొందరు విచ్చేశారు. వారిలో చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే అయినప్పటికీ చంద్రబాబుతో అంటీముట్టనట్లు వ్యవహరించడం విశేషం. తాజా రాజకీయ వేడి ఇక్కడ కూడా చాలా స్పష్టంగా కనిపించింది. 
 
ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటాపోటీగా విమర్శలు చేసుకొని ఉండటం, ఎమ్మెల్యేకు ముడుపుల కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్‌ రావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసీఆర్ హాజరు కాలేదు. విందు సమయంలో చంద్రబాబుకు గవర్నర్‌ దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధులు చంద్రబాబుతో అంటీముట్టనట్లు ఉన్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చంద్రబాబుకు దూరంగా వెళ్లి, స్పీకర్‌ మధుసూదనాచారి వద్ద కూర్చోవడం కనిపించింది. 
 
విందుకు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బీ భోసాలేతోపాటు ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, శాసనమండళ్ల చైర్మన్లు, సీఎస్‌లు, ప్రముఖ క్రీడాకారుడు గోపీచంద్‌ తదితరులు హాజరయ్యారు. విందుకు ముందు.. గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌, రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల్లోని పరిస్థితిని ఈ సమయంలో గవర్నర్‌ ఆయనకు వివరించారు.