శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (09:24 IST)

వేద విశ్వ విద్యాలయాన్ని కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించండి: టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వవిద్యాలయం గా నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర  వేద విశ్వ విద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ ను కోరారు.

ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీలో మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు. 2006 లో టీటీడీ నేతృత్వంలో వేద విద్య వ్యాప్తి, పరిరక్షణ కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయంగా ప్రారంభించామన్నారు.

2007లో యుజిసి దీన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయంగా గుర్తించిందని చైర్మన్ వివరించారు. ఈ వర్శిటీ  వేదాల్లో డిగ్రీ నుంచి పిహెచ్ డి దాకా అనేక కోర్సులు నడుపుతోందన్నారు. సనాతన సంప్రదాయమైన వేద విద్యను ప్రోత్సహించడానికి టీటీడీ సొంతంగా వేద పాఠశాల లు నడపడంతో పాటు, దేశవ్యాప్తంగా 80 వేద గురుకులాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందన్నారు.

వేదం చదివిన వారిని ఆదుకోవడానికి  ఆలయాల్లో వేద పారాయణం, పెన్షన్, అగ్నిహోత్రం ఆర్థిక పథకాలు అమలు చేస్తోందన్నారు. 14 సంవత్సరాలుగా టీటీడీ నిర్వహిస్తున్న వేద విశ్వవిద్యాలయానికి యూజీసీ 2ఎఫ్ గుర్తింపు ఇచ్చిందనీ, ఇప్పుడు 12బి కేటగిరీ గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు విద్యాసంస్థలకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల హోదా ఇచ్చిన విధంగా, ఎస్ వి వేద విశ్వవిద్యాలయానికి జాతీయ వేద విశ్వ విద్యాలయం హోదా ప్రకటిస్తే  దేశంలో తొలి వేద విశ్వవిద్యాలయం గా గుర్తింపు పొంది,  దేశవ్యాప్తంగా వేద విద్య వ్యాప్తికి తోడ్పాటు కలుగుతుందని సుబ్బారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ద్వారా వేద విద్య ఉన్నతికి కట్టుబడి ఉందని మంత్రికి విన్నవించారు.
 
ఎస్వీ కాలేజిలో కోటా పునరుద్ధరించండి  
ఢిల్లీలో టీటీడీ నిర్వహిస్తున్న  శ్రీ వేంకటేశ్వర కాలేజ్ లో తెలుగు, తమిళం, సంస్కృతం విభాగాల్లోని సీట్లలో టీటీడీ కోటాను పునరుద్ధరించాలని సుబ్బారెడ్డి మంత్రికి మరో వినతి పత్రం సమర్పించారు. 2016 ముందు వరకు అమలైన  ఈ కోటాను ఆతరువాత ఢిల్లీ యూనివర్సిటీ  అనుమతించడం లేదన్నారు.

1961లో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ శంఖుస్థాపన చేసిన ఈ కళాశాలను ఢిల్లీలో ని ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటిగా టీటీడీ తీర్చిదిద్దిందన్నారు.