శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 7 ఆగస్టు 2021 (16:13 IST)

కోవిడ్ వ‌ల్లే ప‌రిమితంగా టీటీడీ ద‌ర్శ‌నం టికెట్లు

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ క‌రోనాను డీనోటిఫై చేసే వ‌ర‌కు అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అందువ‌ల్లే తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి త‌క్కువ సంఖ్య‌లో టికెట్లు జారీ చేస్తున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు. లోకకల్యాణం, భక్తుల శ్రేయస్సు దృష్ట్యా ఏడుకొండలవాడి ఆశీస్సులతో ఆధ్యాత్మిక‌, ధార్మిక కార్యక్రమాలను టిటిడి నిరంతరాయంగా నిర్వహిస్తుందన్నారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో శ‌నివారం నిర్వ‌హించిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో, ఆ త‌రువాత జ‌రిగిన మీడియా స‌మావేశంలోను ఈవో మాట్లాడారు. 
 
కరోనా మూడో దశకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న యాత్రికులు కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరామ‌న్నారు. కోవిడ్‌ - 19 పరిస్థితులను అంచనా వేసుకుని శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటున్నామ‌ని చెప్పారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 5 వేల నుండి 8 వేలకు పెంచామ‌ని తెలిపారు. 
 
ఆన్‌లైన్‌లో గదుల అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకున్న భక్తుల కోసం అలిపిరి టోల్‌గేట్‌, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. స్లిప్పులు స్కాన్‌ చేసుకున్న అనంతరం అలిపిరి టోల్‌గేట్‌ నుండి వెళ్తే 30 నిమిషాల్లో, అలిపిరి నడకమార్గంలో నడిచివెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళ్లేవారికి ఒక గంటలో ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.
 
కరంట్‌ బుకింగ్‌లో అయితే భక్తులు తిరుమలలోని సిఆర్‌వోతోపాటు ఆరు ప్రాంతాల్లో గల ఏదో ఒక రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌కు వెళ్లి గుర్తింపు కార్డు చూపి పేరు నమోదు చేసుకుంటే గ‌దులు ఖాళీగా ఉంటే 15 నిమిషాల్లో గది కేటాయింపు ఉప విచారణ కార్యాలయం వివరాలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందుతాయి.
 
ప్రస్తుతం అలిపిరి నడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా భక్తులను అనుమతించడం లేదు. సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తవుతాయి.  గదులు పొందే యాత్రికుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు/సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంప్లైంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ అప్లికేషన్‌ రూపొందించాం. ఫిర్యాదు అందిన అర‌గంట‌లో ఎఫ్ఎంఎస్ సిబ్బంది స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారు. బసకు సంబంధించిన ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన మొబైల్‌ నంబరు  : 9989078111. ప్ర‌తి గ‌దిలో ఈ నంబ‌రును స్టిక్క‌రు రూపంలో అంటిస్తార‌ని ఈవో తెలిపారు.