గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (15:16 IST)

మాకు ఎన్ని టిక్కెట్లు ఇస్తారు.. మొదటి సమావేశంలోనే రచ్చ రచ్చ..!

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి సమావేశం తిరుమలలో జరిగింది. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 24మంది సభ్యులతో పాటు టిటిడి ఈఓ, టిటిడి అదనపు ఈఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదటి సమావేశంలో టిటిడి అధికారులు పలు కీలక నిర్ణయాలను తీసుకుంటారని అందరూ భావించారు కానీ..అలాంటి నిర్ణయాలను ఏమీ తీసుకోలేదు సరికదా టిక్కెట్లపై పెద్ద చర్చే జరిగింది రచ్చ రచ్చగా కనిపించింది.
 
టిటిడి పాలకమండలి సభ్యులను నియమించేది సామాన్య భక్తులకు అవసరమైన నిర్ణయాలను తీసుకుంటారని..కానీ టిటిడి పాలకమండలి మాత్రం ఒక పునరావాస కేంద్రంగా మారిపోయిందంటూ ఇప్పటికే బిజెపి నేతలు, హిందూ ధార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
 
హిందూ సంఘాలు చెప్పినట్లుగానే టిటిడి పాలకమండలి మొదటి సమావేశం కాస్త జరిగింది. బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం నుంచి జరుగబోతున్నాయి. దాని గురించి మాట్లాడారు. అలాగే కళ్యాణోత్సవ టిక్కెట్లపై భార్యా, భర్తలను మాత్రమే అనుమతిస్తున్నారని..అలా కాకుండా పిల్లలను కూడా అనుమతించాలని సభ్యుడు విన్నవించుకున్న నేపథ్యంలో టిటిడి ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు.
 
టిటిడికి సంబంధించిన శ్రవణం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో పనిచేయలేదని తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని నాణ్యమైన పరికరాలు అందించాలని పాలకమండలి సభ్యులు కోరారు. దీంతో దీనిపైనా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
 
ఇదంతా బాగానే ఉన్నా బ్రహ్మోత్సవాల సమయంలో తమ కుటుంబ సభ్యులను ఆలయంలోపలికి పంపించి వాహనసేవలను తిలకించే అవకాశం కల్పించాలని సభ్యులు కోరారు. అంతే కాకుండా తమకు ప్రతిరోజు ఎన్నిటిక్కెట్లు ప్రతిరోజు ఇస్తారన్న విషయంపై కూడా సుధీర్ఘంగా సమావేశంలో చర్చ జరిగింది. మొదటి పాలకమండలి సమావేశం కాస్త ఎన్ని టిక్కెట్లు సభ్యులకు ఇస్తారన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరగడం హిందూ సంఘాలను ఆగ్రహానికి గురిచేస్తోంది.