గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (20:21 IST)

టీవీ, సినిమా షూటింగులకు ఇక ఆన్ లైన్ లో అనుమతులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీవీ, సినిమా షూటింగ్ ల అనుమతిని మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఒక కీలక చొరవ తీసుకుంది. అనుమతుల కోసం ఇక కార్యాలయాలకు రాకుండానే ఆన్ లైన్ లోనే ఉచితంగా అనుమతులు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రదేశాల్లో ఇక షూటింగ్ జరుపుకోవాలి అనుకునే వారు www.apsftvtdc.in వెబ్ సైట్ లో అనుమతికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలా చేసుకున్న దరఖాస్తులను నిర్దిష్ట కాలపరిమితిలో అనుమతి ఇచ్చి, ఆ దరఖాస్తుదారునికి ఆన్ లైన్ లోనే తెలియజేస్తారు. ఈ అనుమతి కాపీని సంబంధిత శాఖ ఇంచార్జి కి కూడా ఒక కాపీని పంపిస్తారు. 

షూటింగ్ కి ఆన్ లైన్ లో అనుమతి ఇవ్వడం ఒక శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలు సులభతరంగాను, అందరికి అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న లొకేషన్లను ఎంపిక చేసుకుని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే, వెంటనే షూటింగ్ కి తగిన అనుమతులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో షూటింగ్ లొకేషన్లకు అనుమతి ఇవ్వాలంటే ఆయా నిర్మాతలు  నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉండేదని, ఇప్పుడు ఉచితంగా ఆన్ లైన్ లోనే షూటింగ్ లొకేషన్ అనుమతి పొందవచ్చని ఎఫ్.డి.సి., ఎండి తెలిపారు.

ఈ మేరకు ఇటీవలే జీవో నెంబర్ 45 కూడా ప్రభుత్వం జారీ చేసిందని అన్నారు.  చలనచిత్ర, టీవీ రంగాలకు మరింత ప్రోత్సాహం ఇవ్వడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విజయకుమార్ రెడ్డి వెల్లడించారు.