1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (20:06 IST)

నిరుద్యోగ భృతి పెంపు... చంద్రన్న మరో తాయిలం

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ పథకాలను వరుసపెట్టి ప్రకటిస్తూ అన్ని వర్గాలనూ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను దగ్గర చేసుకునేందుకు మరొక ముందడుగు వేశారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతువు పెన్షన్‌లను రెట్టింపు చేసిన చంద్రబాబు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ-పేరిట పదివేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. అలాగే రైతులకు నగదు బదిలీ కూడా చేస్తున్నారు. 
 
ఇప్పుడు చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకొని నిరుద్యోగ భృతిని రెట్టింపు చేయబోతున్నట్లు టీడీఎల్పీ సమావేశంలో ప్రకటించారు. నిరుద్యోగ భృతిని ఈ మేరకు రూ. 1000 నుంచి రూ. 2000 వరకు పెంచి సంచలన నిర్ణయం తీసుకునున్నారు. నిరుద్యోగ భృతి పెంపు అంశాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లోపే నిరుద్యోగ భృతి పెంపును అమలు చేయబోతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
 
మరోవైపు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో కాపులకు 5 శాతం .. మిగిలినవారికి 5 శాతం కల్పించేందుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అంతేకాకుండా చుక్కల భూముల చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అగ్రిగోల్డ్‌ చిన్న డిపాజిటర్లకు పరిహారం చెల్లింపు.. సెలూన్లకు ఉచిత విద్యుత్‌ వంటి వాటికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 
 
చంద్రబాబు మరెన్ని వర్గాలను కలుపుకు వెళ్తారో మరికొన్ని నెలలు వేచి చూద్దాం...