కృష్ణా జిల్లాలో రాజకీయాలు భలే వెరైటీగా ఉంటాయి. స్నేహితుల మధ్య పోటీ, బంధువుల మధ్య భేటీ, వారో పార్టీలో, వీరో పార్టీలో... విభిన్న రాజకీయాలు, విలక్షణ స్నేహాలు...అన్నీ వెరసి బెజవాడ రాజకీయాల్ని ఎపుడూ రక్తి కట్టిస్తుంటాయి. ఇపుడు తాజాగా మరో ట్రయాంగిల్ పొలిటికల్ స్టోరీ తెరపైకి రాబోతోంది. అదే... కొడాలితో ఢీకి... రాధా రెడీ!
తెలుగుదేశంలో చిరకాలం ఉండి, చంద్రబాబును తీవ్రంగా ద్వేషించి, వైసీపీకి జంప్ అయిన కొడాలి నాని ఇపుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా, కీలక వర్గానికి నేతగా కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొడాలి నాని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడమే కాదు... వరుసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. అప్పట్లో ఆయనపై తెలుగుదేశం అభ్యర్థిగా దేవినేని అవినాష్ నిలబడ్డారు. వద్దు వద్దన్నా అవినాష్ ను అక్కడ నిలబెట్టిన టీడీపీ అధిష్ఠానం చివరికి అక్కడ ఘోర పరాజయాన్ని పొందింది. ఫలితంగా దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీతోనే విభేదించి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
ఇపుడు తాజాగా గుడివాడ అసెంబ్లీ బరిలోకి విజయవాడకు చెందిన వంగవీటి మోహన రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే రాధా దిగుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ప్రస్తుత మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంగవీటి రాధా సవాల్ విసురుతారని చెపుతున్నారు. గుడివాడ నుంచి కొడాలిని ఢీకొట్టేందుకు వంగవీటి సిద్దమవుతున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.
వంగవీటి రాధా గత ఎన్నికలకు ముందు టీడీపీ యువ నేత నారా లోకేష్ ప్రోద్బలంతో పార్టీలో చేరారు. అప్పట్లో తెలుగుదేశం పసుపు కుంకుమతో ఎన్నికల్లో విజయం సాధించి, తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు నమ్మబలికారు. దీనిని నమ్మిన వంగవీటి రాధా, అకస్మాత్తుగా ఎన్నికల ముందు వైసీపీని వీడి, తెలుగుదేశంలో చేరారు. తను ఎన్నికలలో నిలబడకుండా, కాపు సామాజివర్గాన్ని, వంగవీటి రంగా అభిమానులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో ఎన్నికల పర్యటనలు కూడా చేశారు. అయితే, దురదృష్టవశాత్తు అంచనాలు తప్పి, తెలుగుదేశం ఘోర అపజయాన్ని చవిచూసింది. వైసీపీ ఘన విజయాన్ని సాధించి, వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.
అప్పట్లో వంగవీటి రాధా తొందరపాటు నిర్ణయిం తీసుకోకుంటే, ఈ పాటికి ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యేవారని, లేదా ఎమ్మెల్యేగా అయినా కీలక రాజకీయ పలుకుబడితో ఉండేవారని ఆయన సన్నిహితులు బాధపడుతూండేవారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలుగుదేశాన్ని వీడి వైసీపీలోకి గాని, లేదా కనీసం జనసేనలో కాని చేరాలని చాలా సార్లు వంగవీటి రాధాపై అభిమానులను నుంచి ఒత్తిడి కూడా వచ్చింది. కానీ, రాధా ఎటూ మరల కుండా తెలుగుదేశంలోనే స్తబ్దుగా ఉండిపోయేవారు.
కానీ, ఇపుడు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ప్రజల అసమ్మతి పెరుగుతోందనే కోణంలో మళ్ళీ రాజకీయ నిర్ణయాలు మొదలవుతున్నాయి. 2024లో గుడివాడ నుంచి పోటీ చేసేందుకు వంగవీటి రాదా సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. గుడివాడలోని కాపు సామాజికవర్గం నేతలతో రాధా వరుస భేటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గుడివాడలోని కాపు సామాజిక వర్గంతో వంగవీటి కుటుంబానికి సన్నిహిత సంభందాలున్నాయి. దీనితో అందరితో చర్చించిన తర్వాత సన్నిహితులతో తాను గుడివాడ నుంచి పోటీ చేస్తాననే సంకేతాలను వంగవీటి రాధా ఇచ్చినట్లు చెపుతున్నారు.
గుడివాడ గడ్డపై నానిని మట్టికరిపిస్తానని సన్నిహితులతో వంగవీటి రాధా అంటున్నట్లు తెలుస్తోంది. పైగా, ఇప్పట్లో టిడిపిని వీడే యోచన లేదు ఆయన తన సన్నిహితులకు స్పష్టం చేసినట్లు చెపుతున్నారు. తాను
రాజకీయాల్లో తినాల్సిన ఎదురు దెబ్బలన్నీ తిన్నానని, నా నుంచి ఇకపై పరిణితితో కూడిన రాజకీయాలు చూస్తారని, రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడమే నా లక్ష్యం అని వంగవీటి రాధా చెపుతున్నారట. బడుగు, బలహీనవర్గాలకు ఎల్లప్పుడూ అండగా వంగవీటి కుటుంబం నిలిచిందని, తనను నమ్మిన, నమ్ముకున్న వారి కోసం ఎంత దాకా వెళ్ళేందుకైనా సిద్దం అని సన్నిహితులకు వంగవీటి రాధా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అయితే, మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ముగ్గురూ ప్రాణ స్నేహితులే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలుగుదేశం తరఫున ఎన్నికయి, ఆ పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి బావుటా ఎగురవేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి, వై.సీపీకి వంత పాడుతున్నారు. దీనితో ఆయన్ని పార్టీ నుంచి అధిష్ఠానం పంపేసింది. కానీ, ఇంకా ఆయన సందిగ్ధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగవీటి రాధా ఏకంగా తన మిత్రుడు మంత్రి కొడాలి నానితో ఢీ కొట్టడాన్ని...బెజవాడలో రాజకీయ వింతగానే చూడాల్సి వస్తుంది. రాజకీయాలలో అసాధ్యమనేది ఏదీ లేదు, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు కావడం ఇక్కడ కామన్. కాబట్టి కొడాలి వర్సస్ వంగవీటి ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.