శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 29 జులై 2017 (12:09 IST)

మోడీకి పోటీకి ఎదుగుతున్నానా? వెంకయ్య ఏమంటున్నారు?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోటీగా ఎదుగుతున్నందుకే తనను కేంద్ర మంత్రివర్గం నుంచేకాకుండా బీజేపీ పార్టీ నుంచి తప్పించారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య కొట్టిపారేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోటీగా ఎదుగుతున్నందుకే తనను కేంద్ర మంత్రివర్గం నుంచేకాకుండా బీజేపీ పార్టీ నుంచి తప్పించారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య కొట్టిపారేశారు. శనివారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. త‌న కుటుంబంలో గాంధీలు, నెహ్రూలు లేక‌పోయినా ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి స్థాయికి ఎదిగే అవ‌కాశాన్ని బీజేపీ క‌ల్పించింద‌ని గుర్తుచేశారు. 
 
చిన్న‌నాటి విష‌యాలు, రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి స‌భ్యుల‌తో పంచుకున్నారు. రైతు కుటుంబంలో జ‌న్మించినా చాలా క‌ష్టాలు ఎదుర్కున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌నలో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు విజ‌య‌వాడ నుంచే వ‌చ్చాయ‌ని, జైఆంధ్ర ఉద్య‌మంలో పాల్గొన్నాన‌ని, త‌న‌కు విజ‌య‌వాడ‌తో ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌న్నారు. 
 
వాజ్‌పేయి త‌మ ప్రాంతానికి వ‌చ్చిన‌పుడు రిక్షాలో తిరిగి ప్ర‌చారం చేశాన‌ని, త‌ర్వాత కొన్నాళ్ల‌కు వాజ్‌పేయి ప‌క్క‌నే కూర్చునే అవ‌కాశం క‌లిగిందని, త‌న క‌న్నా పెద్ద‌వాళ్లు అసెంబ్లీలో ఉన్నా ఆయ‌న‌నే పార్టీ నాయ‌కుడిగా ఎంచుకున్నార‌న్నారు. 2019లో కూడా న‌రేంద్ర మోడీ మ‌ళ్లీ ప్ర‌ధానిగా ఎన్నిక‌వ్వాల‌ని వెంక‌య్య ఆకాక్షించారు. ఆయ‌న వ‌స్తే అస‌మాన‌త‌లు త‌గ్గి, దేశం బాగుప‌డుతుంద‌ని తెలిపారు. దేశం ముందుకెళ్లాలంటే స‌రైన‌ నాయ‌క‌త్వం కావాలన్నారు.