శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (18:33 IST)

మిల్లెట్ చికెన్ బిర్యానీపై మనసు పారేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి!!

millets dum biryani
విశాఖపట్టణంలోని పయనీర్ ఫుడ్స్ సంస్థ వంటకాలను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రుచి చూశారు. ముఖ్యంగా, ఈ ఫుడ్ సెంటర్‌లో లభ్యమయ్యే మిల్లెట్ చికెన్ దమ్ బిర్యానీపై ఆయన మనసు పారేసుకున్నారు. ఈ బిర్యానీ తనకు బాగా నచ్చిందంటూ వ్యాఖ్యానించారు. తృణధాన్యాలతో చేసిన చికెన్ దమ్ బిర్యానీని ఎంతగానో ఆస్వాదించానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 
 
తృణధాన్యాలు గొప్ప పోషక విలువలు కలిగివున్న ఆహారం అని వివరించారు. మన ఆరోగ్యకరమైన సంప్రదాయ స్థానిక వ్యవసాయం, స్థానిక వంటకాల్లో ఈ తృణధాన్యాలు అంతర్భాగం అని వివరించారు. ఈ మేరకు పయనీర్ ఫుడ్స్ వారి మిల్లెట్స్ చికెన్ దమ్ బిర్యానీ ఫోటోలను కూడా వెంకయ్య నాయుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఎమ్మెల్యేలను పురుగుల్లా చూశారు : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
 
భారత రాష్ట్ర సమితి అధినేతలు ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ముఖ్యంగా, భారాస అధినేత కేసీఆర్.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చూసేందుకు లేదా కలిసేందుకు అపాయింట్మెంట్ లభించేంది కాదన్నారు. ఒక వేళ దొరికినా గంటల తరబడి బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అందుకే విలువ లేని చోట ఉండలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
ఇటీవలే భారాసకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన దాన నాగేందర్ తాజాగా మాట్లాడుతూ, భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ ఒక కార్పొరేట్ సంస్థ మాదిరి నడిపారని దుయ్యబట్టారు. రెండు రోజుల్లో మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని... 15 రోజుల్లో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని అన్నారు.
 
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని దానం ఆరోపించారు. కేటీఆర్ బినామీలు కూడా వేల కోట్లు దోచేశారని చెప్పారు. వీటికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయట పెడతానని తెలిపారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారని చెప్పారు. కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా... రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీలో చివరకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.