శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (10:16 IST)

మనిషి ప్రాణం తీసిన పప్పు కూర.... ఎలా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో పప్పు కూర ఓ మనిషి ప్రాణం తీసింది. పప్పు కోసం జరిగిన గొడవలో ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వివరాలను విజయనగరం పోలీసులు వెల్లడించారు. 
 
విజయనగరం పట్టణంలో వంట మనిషిగా పనిచేస్తున్న ఆర్‌.శ్రీను అనే వ్యక్తికి రూపావతి అనే యువతితో 22 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వీరిలో ఒకరికి వివాహమైంది. వీరు విజయనగరంలోని లంక వీధిలోని పూరిగుడిసెలో నివసిస్తున్నారు. 
 
అయితే, శ్రీను రోజూ తాగొచ్చి భార్యతో గొడవ పడేవాడు. శనివారం భార్య వంకాయ కూరతో భర్తకు భోజనం పెట్టింది. ఆ కూర వద్దని.. పప్పు వండమని చెప్పాను కదా అన్నాడు. సరే పప్పు చేస్తానని ఆమె వంట ప్రారంభించబోయారు. 
 
ఇంతలో ఆమె వద్దకు వెళ్లి శ్రీను గొడవ పడి కిందపడ్డాడు. అక్కడే కూరగాయలు కోసే కత్తి వీపునకు గుచ్చుకుని రక్తస్రావమైంది. వెంటనే కేంద్రాసుపత్రికి చికిత్సకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
సమాచారం అందుకున్న సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ బాలాజీరావు, ఇతర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ఐ బాలాజీరావు వెల్లడించారు.