1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 22 జనవరి 2017 (05:21 IST)

ఘోర రైలు ప్రమాదంతో ఉలిక్కిపడిన విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రైలు ప్రమాద ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. అంతా నిద్రలోకి జారుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ప్రమాద ఘటన గ

విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రైలు ప్రమాద ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. అంతా నిద్రలోకి జారుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ప్రమాద ఘటన గురించి సంగతే తెలియని పరిస్థితి. దీంతో క్షతగాత్రులకూ ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తర్వాత సమాచారం అందుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చిన్నపాటి గాయాల పాలైన వారిని కూనేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేసి అనంతరం అక్కడి నుంచి పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. 
 
అసలు ఎంతమంది చనిపోయారో తెలుసుకోలేనంతగా జనరల్‌ కంపార్ట్‌మెంటు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. రాయగఢ్‌, పార్వతీపురం ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్పీఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పార్వతీపరం ఆసుపత్రికి 18 మందిని తీసుకురాగా అందులో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గీతాంజలి మహంతి, నీలిమ మిస్రో, భగవాన్‌ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వీరు ఒడిశా ప్రాంతానికి చెందివారు. బొబ్బిలి సమీపంలోని కోమటిపల్లికి చెందిన మరల శంకరావు, ఎస్‌.శ్రీనివాసరావు గాయాలపాలైనవారిలో ఉన్నారు.
 
ఏపీలోని విజయనగరం జిల్లాలో కొమరాడ మండలంలోని కూనేరు రైల్వే స్టేషన్ వద్ద శనివారం అర్థరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనా స్థలంలో పరిస్థితి భీతావహంగా ఉంది. రాత్రి 11.30 నిమిషాల సమయంలో చిమ్మచీకటిలో వేగంగా దూసుకువస్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఉన్నట్లుండి పట్టాలు తప్పింది. నిద్రలోకి జారుకున్న ప్రయాణీకులు పెద్ద కుదుపుతో నిద్రలేచారు. కళ్లు తెరిచేలోగానే హాహాకారాలు.. క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. ఏం జరిగిందో తెలీని స్థితి.
 
ప్రమాద తీవ్రతకు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలు వాటిలో ఇరుక్కుపోయాయి. ఒకదానిపై ఒకటిగా పడిపోయి కనపడుతున్నాయి. బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. చెల్లాచెదురుగా వస్తువులు పడిఉన్నాయి. తమ వారి కోసం వారు ఆతృతగా వెతుకున్న వైనం కంటతడిపెట్టిస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న సహాయ బృందాలు వాటిని తీయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోగీలను కట్‌ చేసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను పార్వతీపురం పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందజేస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే కాన్పూరులో జరిగిన మరో ఘోర రైలు ప్రమాదంలో 145 మందికి పైగా ప్రయాణికులు మరణించిన ఘటన ఇంకా మరువకముందే మళ్లీ ఏపీలో మరో ఘోర ప్రమాదం జరగడం ఉగ్రవాదుల ప్రమేయం ఉందా అనే కోణం బలపడుతోంది. 

ఘటన జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయి. విజయనగరం రైల్వేస్టేషన్‌లో అధికారులు హెల్ప్‌లైన్‌ (8106053006 (ఎయిర్‌టెల్‌), 8500358712 (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఏర్పాటు చేశారు.