గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (15:24 IST)

శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు.. సహకరించని అధికారులు.. 4 రోజులుగా ఆ శవం అక్కడే

deadbody
కృష్ణానదితో పాటు... బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో విజయవాడ నగరం మునిగిపోయింది. దీంతో అనేక మంది వరద నీటిలో చిక్కుకునిపోయారు. వీరిని రక్షించేందుకు, సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కానీ, అధికారులు మాత్రం ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు. పైగా, ఆయన ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు సర్కారుకు ప్రభుత్వ అధికారులు సహాయక నిరాకరణ చేస్తున్నారు. దీంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్‌ ఆవరణలో నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తి చనిపోయాడు. సింగ్ నగర్ పైపుల్ రోడ్డు పక్క సందులో ఈ వ్యక్తి నీటి మునిగి ప్రాణాలు కోల్పోయాడు. 
 
మృతదేహం ఏ వన్ టీ స్టాల్ వద్ద వద్ద ఉంది. దీన్ని తొలగించాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. కానీ, సిబ్బంది మాత్రం ఏమాత్రం చలించలేదు. దీంతో మృతదేహం అక్కడే ఉంది. గత మూడు రోజులుగా మృతదేహం నుండి దుర్వాసన రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా. అనారోగ్య కారణాలవల్ల మృతి చెంది ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే, ఈ మృతదేహం గురించి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చిన, పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల పనితీరు కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదని వారు ఆరోపిస్తున్నారు. సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో తన వ్యక్తిగత భద్రతను సైతం లెక్క చేయకుండా వరద నీటిలో ప్రవహిస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వరద బాధితులు ఆరోపించారు. 
 
మరోవైపు, భారీ వరదలు బెజవాడను వణికించాయి. నగర ప్రజలకు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. సోమవారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా... ప్రస్తుతం 9.5 క్యూసెక్కులుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికి నది నీటి మట్టం మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని, అయినా ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడిందని చెప్పారు. 
 
మరోవైపు బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకు బుడమేరు మహోగ్రరూపం దాల్చించి. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వదర నీరు వచ్చింది. దీని ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. దాదాపు 2.59 లక్షల మంది నీటిలోనే ఉండిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరోవైపు వరద బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది.