శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2016 (21:57 IST)

దుర్గ గుడి పైన ఓపిడిఎస్ఎస్ హ‌వా...

దుర్గ‌గుడిపై ఓపిడిఎస్ఎస్ హ‌వా కొన‌సాగుతోంది. దేవాదాయ‌ శాఖకు సిబ్బంది లేక‌, ఈ సెక్యూరిటీ సంస్థ‌కు ఉద్యోగుల కాంట్రాక్ట్ ఇస్తే, వారే ఏకుమేకు అవుతున్నారు. గ‌త ప‌దేళ్ళుగా ఇంద్ర‌కీలాద్రిపై ఓపిడిఎస్ఎస్ సంస్థ ఏక‌ఛత్రాధిప‌త్యంగా సెక్యూరిటీ విధులు నిర్వ‌హిస్తోంది. గ‌తంలో 250 వ‌ర‌కు ఉద్యోగులు ఈ సంస్థ త‌రపున ఇక్క‌డ ప‌నిచేసేవారు. సెక్యూరిటీ గార్డుకు రోజుకు 306 రూపాయ‌లు, సూప‌ర్‌వైజ‌ర్‌కు రోజుకు 333 రూపాయ‌ల వేత‌నం దేవాదాయ శాఖ చెల్లిస్తోంది. ఈ లెక్క‌న నెల‌కు 23 ల‌క్ష‌ల వ‌ర‌కు ఓపిడిఎస్ఎస్ బిల్లు అవుతుంది. ఇటీవ‌ల సిబ్బంది సంఖ్య‌ను 180 వ‌ర‌కు త‌గ్గించేశారు. దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామి దేవ‌స్థానానికి సంబంధించిన అన్నిచోట్లా సెక్యూరిటీ విధుల‌ను ఈ సిబ్బంది నిర్వంహించాలి.
 
కానీ, సెక్యూరిటీ మాటున ఇందులో కొంద‌రు సొంత పెత్త‌నాలు సాగిస్తున్నారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం మొద‌లుకొని, గుడిలో పైర‌వీల వ‌ర‌కు అన్నీ తామై చేసే ప‌రిస్థితికి వ‌చ్చారు. ప‌దేళ్ళ నుంచి ఒక‌టే సెక్యూరిటీ సంస్థ‌... ఇక్క‌డ హ‌వా న‌డుపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ఏడాది మాత్రం రాణా అనే సెక్యూరిటీ సంస్థ‌కు అవ‌కాశం వ‌చ్చింది. ఏళ్ళుగా ఓపిడిఎస్ఎస్ ఇక్క‌డ పాతుకుపోవ‌డంతో దేవాదాయ‌శాఖ ఉన్న‌తాధికారుల‌ను కూడా న‌డిపించే స్థాయికి చేరారు. 
 
గుడిలో పైస‌లు వ‌చ్చే రిసెప్ష‌న్, అంత‌రాల‌యంలో త‌మ‌కు అనుకూల‌మైన ఇన‌స్పెక్ట‌ర్ల‌ను డ్యూటీలు వేయించ‌డం వంటి ప‌నులు కూడా చేయిస్తున్నారు. ఈ ఏడాది మార్చి చివ‌రిక‌ల్లా ఓపిడిఎస్ఎస్ కాంట్రాక్ట్ గ‌డువు ముగుస్తోంది. గ‌త ఏడాదే గ‌డువు ముగియ‌డంతో తొల‌గించే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఓపిడిఎస్ఎస్ కోర్టుకు వెళ్లింది. మ‌ధ్యంత ఉత్త‌ర్వుల ఆధారంగా ఇపుడు దుర్గ‌గుడిలో విధులు నిర్వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఏడాది కూడా కాంట్రాక్ట్ కొన‌సాగించేలా ఇప్ప‌టికే ఓపిడిఎస్ఎస్ పైర‌వీలు కొన‌సాగిస్తున్న‌ట్లు స‌మాచారం. దీనిపై ఉన్న‌తాధికారులు వివ‌ర‌ణ ఇచ్చేందుకు కూడా ముందుకు రావ‌డం లేదు.