సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (13:49 IST)

పదో తరగతి అమ్మాయిని పెళ్లాడిన టీచర్.. అసలు సంగతి ఎప్పుడు తెలిసిందంటే..?

టీచర్‌ను పెళ్లాడిన యువతికి షాక్ తప్పలేదు. ప్రేమ మాయలో పడి పెళ్లి చేసుకుని కాపురం పెట్టిన ఆ యువతికి.. అతనికి ముందే పెళ్లై భార్యాపిల్లలున్నారని తెలిసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, తాడిగడపకు చెందిన యువతి కొన్నేళ్ల క్రితం స్థానిక అయ్యప్ప నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టెన్త్ చదివింది. అదే సమయంలో తోడేటి సురేష్ అనే వ్యక్తి అక్కడే టీచర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో యువతిని ట్రాప్ చేసిన సురేష్.. ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. అంతేకాకుండా గత ఏడాది సెప్టెంబర్ 10న నెల్లూరు జిల్లా కావలికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అక్కడే కాపురం పెట్టాడు.
 
కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. సురేష్ కు గతంలోనే పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని యువతికి తెలిసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న బాధితురాలు.. భర్తని నిలదీసింది. 
 
దీంతో అప్పటి నుంచి ఆమెను శారీరకంగా మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. సురేష్‌తో పాటు అతడి సోదరి, మేనల్లుడు కూడా హింసలకు గురిచేశారు. అక్కడితో ఆగకుండా ఆమెపై వాట్సాప్, ఫేస్ బుక్‌లో అసభ్యంగా ప్రచారం చేశారు.
 
దీంతో విసిగిపోయిన ఆమె వారి నుంచి తప్పించుకొని తాడిగడపలోని పుట్టింటింకి చేరుకుంది. తల్లిదండ్రుల సాయంతో పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సురేష్ బాబుతో పాటు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.