సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 మే 2020 (09:22 IST)

గ్యాస్ లీక్ ప్రమాదంతో విశాఖలో పిట్టల్లా రాలిపోతున్నారు .. 8కి పెరిగిన మృతులు

విశాఖపట్టణంలో గురువారం తెల్లవారుజామున జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో స్థానికులు పిట్టల్లా రాలిపోతున్నారు. తొలుత ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రులకు తరలించగా, వారిలో మరో ఐదుగురు చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో గ్యాస్ లీకేజీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆర్ఆర్ వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందగా, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందినట్టు సమాచారం. బాధితులతో కేజీహెచ్ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది.
 
మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో విశాఖపట్టణంకు చేరుకోనున్నారు. ఆయన అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.45గంటలకు విశాఖకు చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన బాధితులను పరామర్శించనున్నారు. అంతేకాకుండా, మృతుల కుటుంబాలను ఆయన ఓదార్చనున్నారు. మరోవైపు, గ్యాస్ లీకైన ప్రాంతం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
 
అలాగే, ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్‌ ఆర్‌కే మీనాతో ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు సరైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. అలాగే, స్థానిక మంత్రులంతా అక్కడకు చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు.