బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:59 IST)

ఎన్నికల వాయిదా పై నిమ్మగడ్డ మమ్మల్ని సంప్రదించలేదు: హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్

ఎపి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ పై హైకోర్టులో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేశారు.

నిమ్మగడ్డను తొలగించేందుకే ఆర్డినెన్స్ తెచ్చారనడాన్ని ఖండిస్తున్నట్టు ద్వివేది తమ కౌంటర్ పిటిషన్  లో తెలిపారు. ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకే ఆర్డినెన్స్ ను తీసుకువచ్చామని వివరించారు.

ఈ వ్యవహారంలో రమేశ్ కుమార్ చేసిన ఆరోపణలేవీ నిజం కావని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం గవర్నర్ కు ఉందని, గవర్నర్ ఆమోదించాకే ఆర్డినెన్స్ ను తీసుకువచ్చామని తెలిపారు.

గవర్నర్ ఆమోదించాక ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని ద్వివేది హితవు పలికారు. కాగా, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీ హోదాలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ తమను సంప్రదించలేదని ప్రభుత్వం కౌంటర్ లో పేర్కొంది.

అటు, కరోనా విషయంలోనూ ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ సంప్రదించలేదని ద్వివేది వివరించారు. ఎన్నికలు వాయిదా పడినా కోడ్ కొనసాగుతుందని నిమ్మగడ్డ ప్రకటించడం సరికాదని తెలిపారు.