గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జులై 2019 (20:02 IST)

ప్రజా ధనం దుర్వినియోగం అవుతోంది... అందుకే విద్యుత్‌, పీపీఏల పునః సమీక్ష: అజయ్ కల్లాం

రాష్ట్రంలో సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి ఉందని, అధిక ధరలకు ఒప్పందాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం అభిప్రాయపడ్డారు. సోమవారం సచివాలయంలోని ప్రచార విభాగంలో అజేయ కల్లాం మాట్లాడుతూ... 
 
కేంద్ర బడ్జెట్ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముందు రోజు 2018-19 ఆర్థికసర్వే ప్రవేశపెట్టిందన్నారు. ఆ  ప్రకారం దేశ వ్యాప్తంగా పవన, సౌర విద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గాయని, ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సిన అవసరం రాష్ట్రాలకు లేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.4.84కు ఒప్పందం చేసుకున్నారన్నారు. 
 
పలుచోట్ల దీనికంటే తక్కువ ధరకే విద్యుత్‌ లభ్యమవుతున్నప్పుడు ఇంత ఎక్కువ ధరకు గత ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.  వాల్యూమ్‌-1లోని 176వ పేజి 9.23 పేరాగ్రాఫ్‌ లో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని ఆయన తెలిపారు. 
 
2010 సంవత్సరంలో 18 రూపాయలుగా ఉన్న సౌర విద్యుత్‌ యూనిట్‌ (కిలోవాట్స్‌ పర్‌ అవర్‌) ధర 2018 నాటికి 2 రూపాయల 44 పైసలకు పడిపోయినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారని అజేయకల్లాం తెలిపారు. అదే విధంగా పవన విద్యుత్‌ కూడా 2017 డిసెంబర్‌కే సగటున రు.4.20 నుండి 2.43 రూపాయలకు పడిపోయినట్లు వివరించారు. ఈ తరుణంలో గత ప్రభుత్వం పీపీఏలను రూ.6 లకు ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 
 
పీపీఏల వల్ల ఏటా రూ.2,500 కోట్ల ప్రజాధనం అదనంగా ఖర్చయిందని చెప్పారు. టెండరింగ్ లేకుండా ఒప్పందాలు కుదుర్చుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. పీపీఏలు లేకుండానే యూనిట్ రూ.2.72లకు అందిస్తామని అనేక కంపెనీలు ముందుకొస్తున్నా.. గత ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలియడం లేదన్నారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రావన్నది తప్పుడు ప్రచారమని వెల్లడించారు. 
 
ఎప్పుడైనా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలని సూచించారు. అందులో భాగంగానే పారదర్శక ఒప్పందాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2010లో రూ.18 ఉన్న సౌరవిద్యుత్ యూనిట్ రూ.2.45కు తగ్గిందని  గుర్తుచేశారు. 
 
అదేవిధంగా పవన విద్యుత్ యూనిట్ రూ.4.20 నుంచి 43 పైసలకు పడిపోయిందని తెలిపారు. టెండర్‌ ప్రక్రియలో ఎల్‌1కు చివరి సంస్థకు మధ్య గరిష్టంగా యూనిట్‌కు 10 పైసలు మాత్రమే తేడా ఉండగా, తాజా టెండర్లలో అది 27 పైసలకు చేరిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన అల్ట్రా మెగా సోలార్‌పార్క్‌ లో కేంద్రం తిరస్కరించిన సాఫ్ట్‌ బ్యాంకు ఎనర్జీ సంస్థ 350 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేసిందని తెలిపారు. 
 
పైగా యూనిట్‌కు 2.71 రూపాయలకు టెండర్‌ దాఖలు చేస్తేనే రింగ్‌ అయిందని పేర్కొంటూ కేంద్రం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనిట్‌కు 4.63 రూపాయలను కూడా సంస్థ వసూలు చేస్తోందన్నారు. అక్రమాలు ఏమీ లేకుండానే యూనిట్‌ ధర ఇక్కడ అంతగా పెరిగిందా? సమీక్షిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అజేయకల్లాం అన్నారు.  
 
పీపీఏలు లేకుండానే యూనిట్‌ రూ.2.70కు ఇస్తామని అనేకమంది ముందుకొస్తున్నారని అజేయ కల్లం చెప్పారు. అదానీ, టాటా, ఎస్సార్‌ సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయవచ్చన్నారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో చర్చలు జరుపుతామని.. ధరలు తగ్గిస్తే ఆ ఒప్పందాలను కొనసాగిస్తామని అజేయ కల్లం స్పష్టం చేశారు. 
 
రాష్ట్రంలో సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి ఉందని అజేయకల్లాం తెలిపారు. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని తెలిపారు.  వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి  చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏపీ ప్రభుత్వంలో 133 పీపీఏలు ఉన్నాయని అందులో పీపీఏలదే 70 శాతం వాటా ఉందని అజేయకల్లాం తెలిపారు. 
 
ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం రాష్ట్రానికి నష్టమని సూచించారు. పీపీఏలు సమీక్షిస్తే తప్పు చేయనివారికి భయమెందుకు? అని ఈ సందర్భంగా  ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం ప్రశ్నించారు. పారదర్శక ఒప్పందాల కోసం సీఎం ప్రయత్నిస్తున్నారని దీన్ని రాద్దాంతం చేయవద్దని కోరారు. ఇంధన శాఖ కార్యదర్శి, ఏపీ ట్రాన్స్ కో సీఎండీ ఎన్. శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తగా వస్తున్న పరిశ్రమలపై విద్యుత్ భారం వేయలేమని వెల్లడించారు. డిస్కంలు రూ. 20 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. 
 
డిస్కంలు రుణపరిమితి దాటి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి 26.6 శాతానికి చేరుకుందని,  ఇప్పటికే వినియోగదారులపై అధిక భారం ఉందని భావిస్తున్నామని శ్రీకాంత్ తెలిపారు. మీడియా సమావేశంలో  ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాంతో పాటు స్పెషల్ సీఎస్ పీవీ రమేష్, ఇంధన శాఖ కార్యదర్శి, ఏపీ ట్రాన్స్ కో సీఎండీ ఎన్.శ్రీకాంత్, జేఏండీ ఏపీ ట్రాన్స్ కో కేవీఎన్  చక్రధరబాబు తదితరులు పాల్గొన్నారు.