మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (22:48 IST)

అగ్ని ప్రమాదం జరిగితే చంద్రబాబు ఎందుకు మాట్లాడం లేదు?: శ్రీకాంత్ రెడ్డి

రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా రోగులను దృష్టిలో పెట్టుకొని వైద్యానికి ప్రభుత్వం అనుమతినిస్తే దాన్ని కొన్ని ఆస్పత్రులు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. 
 
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే కమిటీలు వేసే చంద్రబాబు ఆదివారం జరిగిన ప్రమాదంపై ఎందుకు కమిటీ వేయలేదని ప్రశ్నించారు. ప్రతి దానికి కులంతో ముడిపెట్టి రాద్ధాంతం చేసే చంద్రబాబు... రమేష్‌ చౌదరి విషయంలో ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు.
 
‘చంద్రబాబు నిర్వహించిన జూమ్‌ కార్యక్రమంలో రమేష్‌ చౌదరి పాల్గొని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కానీ కరోనా నియంత్రణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పాలన బాగోలేదని విమర్శలు చేసే రమేష్ చౌదరి కరోనా పేషెంట్స్‌ నుంచి వేలకు వేలు లక్షలకు లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. 
 
రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వలనే 10 మంది చనిపోయారు అని ప్రాధమికంగా తేలింది. రాజధాని నడి బొడ్డున భారీ అగ్ని ప్రమాదం జరిగితే ఎందుకు చంద్రబాబు మాట్లాడం లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. 
 
చంద్రబాబు ఉద్దేశాలన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. ఆయనకు ఎలాగూ రాజకీయ భవిష్యత్తు లేదని భావించి, ఆ జూమ్ యాప్ ద్వారా లేనిపోనివి ఏదో ఒకటి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. 
 
ఎవరైనా గానీ తప్పు చేసినవాడికి శిక్ష పడాలన్నదే మా ప్రభుత్వ నైజం. విజయవాడ ఘటనపై కమిటీ వేయడమే కాకుండా ఎక్స్ గ్రేషియా రూ.50 లక్షలు కూడా ప్రకటించాం. కమిటీ నివేదిక వచ్చాక కారకులపై కఠినచర్యలు తీసుకుంటాం’అని శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు.