బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

విజయవాడం, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక!!

hyderabad metro
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైకాపా పాలనలో అటకెక్కించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను బూజు దులిపి మళ్లీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు నిర్ణయించారు. ఇందులోభాగంగా, అమరావతి నిర్మాణం పనులను డిసెంబరు నుంచి ప్రారంభించనున్నారు. అలాగే, విజయవాడ - గంటూరు నగరాలను అనుసంధానిస్తూ, రాజధాని అమరావతి మీదుగా మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించనున్నారు. అలాగే, విశాఖపట్టణంలో కూడా మెట్రో ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. 
 
గత జగన్ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులను పూర్తిగా అటకెక్కించింది. ఇపుడు ఈ ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం చంద్రబాబు గురువారం ఈ రెండు ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. రెండు మెట్రోలకు తొలిదశలో చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే కేంద్రానికి పంపాలని ఆయన ఆదేశించారు. సవరించిన డీపీఆర్ ప్రకారం... రెండు దశలకు కలిపి విజయవాడ - అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.25,130 కోట్లు, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు రూ.17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 
 
విజయవాడ - అమరావతి మెట్రో మార్గం మొత్తం పొడవు 66.20 కిలో మీటర్లు. దీన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. తొలి దశలో 38.40 కిలోమీటర్లు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.11,009 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 25.95 కి.మీ., బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కి.మీ. రెండో దశలో 27.80 కి.మీ చేపడుతారు. ఇందుకోసం నిర్మాణ వ్యయం రూ.14,121 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 
 
ఈ ప్రాజెక్టుపై ఏపీ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రాజధాని అమరావతికి 27.80 కిలోమీటర్ల మార్గం నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును కేంద్రం భరించాలని కోరారు. 'ఆ రెండు ప్రాజెక్టులపై 2019కి ముందు చాలా కసరత్తు చేసి కేంద్రం ఆమోదానికి పంపాం. కొత్త పాలసీ తెస్తున్నామని, దాని ప్రకారం మళ్లీ దరఖాస్తు చేయాలని కేంద్రం సూచించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సవరించిన అంచనాల్ని, డీపీఆర్లను కేంద్రానికి పంపిస్తున్నాం' అని ఆయన తెలిపారు. విశాఖ మెట్రో తొలిదశ ప్రాజెక్టు పనుల్ని నాలుగేళ్లలో పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు ఆయన తెలిపారు.