సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:02 IST)

రాజకీయం వేరు.. రక్తసంబంధం వేరు .. జగన్ నా తోడబుట్టిన అన్న... వైఎస్ షర్మిల

రాజకీయం వేరు.. రక్తసంబంధం వేరు .. వైఎస్. జగన్ నాకు తోడబుట్టిన అన్న.. ఆయన ఆశీస్సులు ఉన్నాయనే నమ్ముతున్నాను అంటూ వైఎస్. షర్మిల తన అనుచరులు, మద్దతుదారులతో అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపన దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా, మంగళవారం తొలి అడుగు పడింది. హైదరాబాద్ నగరంలోని లోటస్‌పాండులో ఉన్న తన నివాసంలో ఆమె రాజన్న మద్దతుదారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'రాజన్న పాలన సువర్ణ పాలన. ఆయన పాలనలో రైతులు రాజుల్లా బతికారు. ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు ఉండాలని వైఎస్సార్‌ కలలు కన్నారు. ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదివి, గొప్ప ఉద్యోగాలు చేయాలనుకున్నారు. అనారోగ్యం వస్తే పేదలు అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చారు. కానీ, ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 
 
అందుకే రాజన్న రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటున్నాను. అది మనతోనే సాధ్యమన్నది నా నమ్మకం. ఈ దిశగా నా పయనంలో భాగంగానే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాను' అని చెప్పారు. ఈ సమావేశంలో తాను మాట్లాడేందుకు రాలేదని, చెబితే విని అర్థం చేసుకునేందుకే వచ్చానని తెలిపారు.
 
ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌తో  రాజకీయ సంబంధాలు ఎలా ఉంటాయని నల్గొండ జిల్లా నేతలు ఆమెను ప్రశ్నించారు. రక్తసంబంధం వేరు, రాజకీయం వేరని, అన్నా చెల్లెలు బంధం ఎక్కడికీ పోదన్నారు. కాగా, చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపట్టాలని కొందరు, సాగర్‌ నుంచే చేపట్టాలని మరికొందరు ప్రతిపాదించారు. సాగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రతిపాదన కూడా వచ్చినట్లు తెలిసింది. 
 
అయితే, ఆమె మాత్రం తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు. ఏ విధంగా తేవాలి, ఇందుకు ఎప్పుడు ఏం చెయ్యాలన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకే అన్ని జిల్లాల వారితో సమావేశమవుతున్నానని వివరించారు.