సస్పెండ్ చేయమన్న ఎమ్మెల్యే... మనోవేదనతో గ్రామ కార్యదర్శి మృతి
అధికారబలంతో రెచ్చిపోతున్న వైకాపా నేతలు చేస్తున్న బెదిరింపులకు పలువురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గ్రామ వలంటీర్లు, కార్యదర్శులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా ఓ గ్రామ కార్యదర్శి మనోవేదనతో మృతి చెందారు. ఎమ్మెల్యే హెచ్చరికతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై చనిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో జరిగింది.
ఈ గ్రామానికి చెందిన పుప్పల శ్రీదేవి (39) గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అయితే, ఈ గ్రామంలో 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదీన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు పాల్గొన్నారు. ఆ సందర్భంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేదంటూ ఆయన కార్యదర్శి శ్రీదేవి, సచివాలయ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదేవితోపాటు డిజిటల్ అసిస్టెంట్ను సస్పెండ్ చేయించారు.
అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇటీవల విధుల్లో చేరినా పూర్తి బాధ్యతలు అప్పగించలేదు. ఈ పరిణామాలతో వేదనకు గురై అనారోగ్యం పాలయ్యారు. కుమార్తె పరిస్థితి చూడలేకపోయిన తల్లి రమణమ్మ ఆమెను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆరోగ్యం మరింత క్షీణించి, మృతి చెందారు. మంగళవారం వాడ్రాపల్లి సర్పంచి కాండ్రేగుల నూకరాజు, గ్రామస్థులు శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించారు.