శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (22:43 IST)

వైకాపా ప్రజాప్రతినిధులకు ధైర్యం లేదు: బచ్చుల అర్జునుడు

మూడు రాజధానుల నిర్ణయం సరైనదని ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తే, అదే ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళదాం రమ్మని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన సవాలును స్వీకరించడానికి, వైకాపా ప్రజాప్రతినిధులకు ధైర్యం చాలటం లేదని విమర్శించారు తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు. 
 
మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దంటూ  తెలుగుదేశం పార్టీ నిరసన
గవర్నర్ ఆమోదం తెలిపిన మూడు రాజధానులు బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల జీవో ల ప్రతులను, మంగళవారం, మచిలీపట్నంలోని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కార్యాలయం వద్ద  పలువురు తెలుగుదేశంపార్టీ నాయకులు దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటు, ప్రజా రాజధానిగా అమరావతి కొనసాగే వరకు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు.
 
ఐదేళ్లపాటు  ఓటేశారని రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అధికారం ఎవ్వరికీ లేదన్నది ఈ వైకాపా ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. రాజధాని అమరావతి విషయం ఐదు కోట్ల ప్రజల సమస్య ఏ ఒక్కరిదో కాదు అన్నారు.
 
రాష్ట్ర విభజన జరిగి రాజధాని లేని పరిస్థితుల్లో, రాష్ట్రానికి నడిబొడ్డున అన్ని జిల్లాలకు అందుబాటులో అమరావతి రాజధాని ఉంటుంది అని, అందరూ ఏకగ్రీవంగా అప్పటి అసెంబ్లీలో తీర్మానం చేసి ఎంపిక చేసిన రాజధాని అమరావతి అని, కేంద్రం చట్టం ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఎంపిక చేసిన రాజధాని అమరావతి అన్నారు.
 
కరువు సీమ అనంతపురంలో కియా కార్లు పరిగెత్తించామని, దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డి ఐ రూ.13,500 కోట్ల పెట్టుబడి, పదివేల మందికి ఉపాధి కల్పించామన్నారు. కర్నూలు జిల్లాలో రూ.670 కోట్లతో 623 ఎకరాల విస్తీర్ణంలో మెగా సీడ్ పార్క్, ప్రపంచంలో  మూడో అతిపెద్ద కర్నూలు సోలార్ పార్క్ ను 5,683 ఎకరాల్లో రూ.7 వేల కోట్లతో ఏర్పాటు చేశామన్నారు, రూ.110 కోట్లతో 18 నెలల్లో ఓర్వకల్లు విమానాశ్రయాని నిర్వహించామన్నారు.

దేశంలో మొబైల్ ఫోన్లను అత్యధికంగా తయారుచేసే జిల్లాగా చిత్తూరు జిల్లాను మార్చి వేశామన్నారు, చిత్తూరు జిల్లాలో రూ.90 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు, కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశాం అని, కడప ఎయిర్ పోర్ట్ ను వాడుకలోకి తీసుకువచ్చామని, గండికోట రిజర్వాయర్ పూర్తి చేసి జిల్లాకు సాగునీరు అందించామన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్థిక లోటు తో విభజన జరిగిన రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా చూస్తూ చేసిన అభివృద్ధి ఈ వైకాపా నాయకుల గుడ్డి కళ్ళకి కనపడటం లేదని ఎమ్మెల్సీ అర్జునుడు విమర్శించారు. ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా రాష్ట్రానికి ఇప్పటివరకు ఏ విధమైన పరిశ్రమలు అయిన  తెచ్చారని విమర్శించారు అర్జునుడు. 
 
ఈ వైకాపా ప్రభుత్వ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది అన్నారు. రాజధాని అమరావతి అంశంపై వైకాపా నాయకులు జగన్ మోహన్ రెడ్డి తో సహా  ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు? మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చెప్పిందేమిటి, ఈ వైకాపా పార్టీ చేస్తోంది ఏమిటి? మాట తప్పం, మడమ తిప్పం, అంటూ అప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు అర్జునుడు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్నారు.
 
చిచ్చుపెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా అమరావతి రాజధాని ఆహ్వానిస్తున్నాం అని అప్పుడు చెప్పి, ఇప్పుడు ఇది ఏంటి? ఇది వైకాపా పార్టీ చిచ్చుపెట్టడం కాదా? ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఈ వైకాపా ప్రభుత్వం సాధించేది ఏమిటి?
 
జగన్మోహన్ రెడ్డి మీ రేటు లక్ష కోట్ల సంపద మీ నాయన ను అడ్డంపెట్టి సంపాదించారు. ప్రజల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం సృష్టించిన రూ లక్ష కోట్ల సంపద నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు మీకు? ప్రజల సంపద రూ లక్ష కోట్లు నాశనం చేస్తామంటే మాత్రం సహించం గుర్తుంచుకోండి అని హితవు పలికారు అర్జునుడు.
 
అమరావతి రాజధాని కోసం రాజకీయ పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా సంపద పరిరక్షిస్తాము.  ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం, తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోబాధ్యత గా పని చేస్తుంది అన్నారు.
 
ఎన్నికల ముందు ప్రజా రాజధాని అమరావతిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకు మారుస్తాం, జగన్మోహన్ రెడ్డి  తాడేపల్లి లో రాజగృహ ప్రవేశం చేశారు, అమరావతి రాజధాని మారిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని, ఎన్నికల ముందు పలికిన వైకాపా ప్రజాప్రతినిధుల మాటలు ఇప్పుడు ఏమైనాయి అని, వైకాపా ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు ఎమ్మెల్సీ అర్జునుడు.
 
ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ పంచ పర్వాల కాశీ విశ్వనాథం (చంటి), తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి పివి ఫణి కుమార్, 9వ వార్డు మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.