గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 13 మే 2024 (12:56 IST)

తెనాలి ఓటరుపై వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దాడి: స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా సీరియస్

YCP MLA Candidate Attacks Tenali Voter
తెనాలి ఐతానగర్ లోని ఓటింగ్ కేంద్రం వద్ద వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ సామాన్య ఓటరుపై చేయి చేసుకోవడంపై స్పెషల్ పోలీసు అబ్జర్వర్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఘటన జరిగిన పోలింగ్ బూత్ తాలూకు దృశ్యాల వీడియోను పరిశీలించారు. అభ్యర్థి దాడికి సంబంధించిన పూర్తి ఫుటేజిని తెప్పించాలంటూ అధికారులను ఆదేశించారు. ఏపీలో జరుగుతున్న పోలింగ్ సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 42 వేల సిసి కెమేరాలు పెట్టినా హింసాత్మక ఘటనలు జరగడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా ఇప్పటివరకూ ఏపీలో జరిగిన పోలింగ్ సరళిని ఏపీ సీఈసి ముకేశ్ కుమార్ మీనా ఆయనకు వివరించారు.
 
ఎమ్మెల్యే అభ్యర్థి చెంప ఛెళ్లుమనిపించిన తెనాలి ఓటర్
ఓటరు ఒకరు ఎమ్మెల్యే అభ్యర్థి చెంప ఛెళ్లుమనిపించారు. ఓటు వేసేందుకు వరుసలో రాకపోవడమే ఆ ఎమ్మెల్యే చేసిన తప్పు. వరుస క్రమంలో రావాలని తెనాలి అధికార పార్టీ ఎమ్మెల్యే శివకుమార్‌ను ఒక ఓటరు కోరారు. దీన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు కదా... ఆ ఓటరు చెంపపై కొట్టాడు. దీంతో ఆ ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అప్పటికే అనేక మంది ఓటర్లు క్యూలో ఉన్నా ఆ ఓటర్లను పట్టించుకోకుండా ఆయన పోలింగ్ బూత్‍‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. ఇది చూసి క్యూలో ఉన్న ఒక ఓటరు అభ్యంతరం తెలిపారు. అందిరితో పాటు క్యూలో రావాలని సూచించారు. 
 
దీంతో ఆవేశానికి లోనైన ఎమ్మెల్యే శివకుమార్ ఆ ఓటరుపై చేయి చేసుకున్నారు. సడెన్‌గా జరిగిన ఈ సంఘట నుంచి వెంటనే తేరుకున్న ఆ ఓటరు... అదే స్పీడ్‌తో ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై ఒక్కటిచ్చాడు. ఇది చూసిన అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు రంగంలోకిదిగి ఆ ఓటరుపై మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ బయటకు లాక్కెళ్లారు.