ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి  
                                       
                  
				  				  
				   
                  				  తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వెళతారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయ. తొలి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సమావేశాలకు డుమ్మా కొట్టారు. 
				  											
																													
									  
	 
	అయితే, స్పీకర్ అనుమతిలేకుండా వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరుకాకుంటే ఆ సభ్యుడుపై అనర్హత వేటు పడుతుందనే నిబంధన ఉంది. దీంతో భయపడిపోయిన వైకాపాకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. 
				  
	 
	ఇదే అంశంపై వైవీ సుబ్బారెడ్డి ఆదివారం గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తమ పార్టీ అధినేత జగన్‌కు సరైన భద్రత కల్పించడం లేదన్నారు. వైకాపా నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	గుంటూరు మిర్చి యార్డు వెళ్ళినపుడు జగన్‌కు సరైన భద్రత కల్పించలేదని ఆరోపించారు. ఆయనకు హాని కలిగించే విధంగా వ్యవహరించారని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా జడ్ ప్లస్ భద్రతను కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. 
				  																		
											
									  
	 
	మరోవైపు, జగన్‌కు విపక్ష నేత హోదా ఇవ్వకుండా అవమానపరుస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కాబట్టే అసెంబ్లీకి వెళ్లాలని జగన్ నిర్ణయించారని, అనర్హత వేటుకు భయపడి అసెంబ్లీకి వెళ్లడం లేదన్నారు.