శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2024 (09:26 IST)

బాబ్బాబు.. ప్లీజ్ పార్టీ మారొద్దు.. మీ బలంవల్లే ఢిల్లీలో నాకు గౌరవం : పార్టీ నేతలతో జగన్ కామెంట్స్

jagan
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చావుదెబ్బ తగిలింది. ఈ ఓటమి నుంచి ఆ పార్టీ నేతలు ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు. పైగా, ఇక వైకాపాలో భవిష్యతే లేదనే నిర్ణయానికి వస్తున్నారు. ఏపీలో ఏర్పాటైన టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వ పాలన బాగుందంటూ ప్రజల నుంచి సానుకూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటివారిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులుగా ఉన్న వారు కావడం గమనార్హం. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమతమ పదవులకు రాజీనామాలు చేశారు. వీరిలో కొందరు టీడీపీలో చేరగా మరికొందరు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైంది. ముఖ్యంగా, రాజ్యసభకు ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు రాజీనామా చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
అలాగే, తనకు సన్నిహితులుగా ఉన్న ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌, గొల్ల బాబూరావుతో పాటు మేడా రఘునాథరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య కూడా రాజీనామాలు చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. దీంతో కలతచెందిన మాజీ సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగి, వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీని, తనను వదిలిపోవద్దని అభ్యర్థించారు. రాజ్యసభలో వైసీపీకి ఉన్న బలం వల్లే ఢిల్లీలో తనను గౌరవిస్తున్నారని.. మీరు రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికల్లో ఆ పదవులన్నీ టీడీపీకి వెళ్లిపోతాయని చెప్పారు. రాజీనామా చేయడం తనకు వెన్నుపోటు పొడవడమేనని నిష్ఠూరం ఆడినట్లు సమాచారం. 
 
ఈ బుజ్జగింపుల ప్రభావమో ఏమో.. అయోధ్యరామి రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ శుక్రవారం తాడేపల్లి ప్యాలెస్‌ ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. తాము జీవితాంతం జగన్‌ వెంటే ఉంటామంటూ ప్రకటించారు. తనకు వ్యక్తిగతంగా నష్టాలు, కష్టాలూ ఉన్నా వైసీపీని వీడడం లేదని.. రాజ్యసభకు రాజీనామా చేయడం లేదని అయోధ్యరామి రెడ్డి చెప్పారు. గొల్ల బాబూరావు, రఘునాథరెడ్డి కూడా పార్టీని వదిలివెళ్లరని ఆయన చెప్పారు. మీడియాకు ఈ విషయం చెప్పాలని జగన్‌ సూచించారని బోస్‌ వెల్లడించారు. తాము రాజ్యసభకు రాజీనామా చేస్తే ఆ పదవులు టీడీపీకి వెళ్లిపోతాయని.. అది ఒక విధంగా జగన్‌కు వెన్నుపోటు పొడవడంతో సమానంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.