శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (21:10 IST)

వైఎస్ అవినాశ్ పైన అందుకే నేను పోటీ చేస్తున్నా : వైఎస్ షర్మిల

sharmila
తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తన చిన్నాన్ని విషయంలో హంతకులతో వున్నారనీ, ఆయన కడప నుంచి మళ్లీ గెలవరాదన్న ఏకైక లక్ష్యంతోనే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో షర్మిలను కడప లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించింది.

అభ్యర్థుల జాబితాను ఆమె విడుదల చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, హంతకుడు అవినాశ్‌ను ఎంపీ కానివ్వకపోవడమే తన లక్ష్యమని తెలిపారు. తనను వైఎస్ఆర్ వారసురాలిగా వైఎస్ఆర్ బిడ్డగా ప్రజలంతా ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ నిర్ణయం సులువైంది కాదని తనకు తెలుసన్నారు. కుటుంబం నిలువునా చీలుతుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. 
 
"నా అనుకున్న వాళ్ళను జగనన్న నాశనం చేశారు. చిన్నాన్న వివేకాను చంపించిన వారిని జగనన్న వెనకేసుకొస్తున్నారు. తద్వారా హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలిచారు. చిన్నాన్న హంతకులను జగన్ కాపాడుతున్నారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాశ్‌ను టిక్కెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయాను.

కడపలో అతడు మళ్లీ గెలవకూడదనే నేను పోటీకి దిగుతున్నా. అవినాశ్‌ను ఎంపీ కానివ్వకపోవడమే నా లక్ష్యం. గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయం కోసం ఉపయోగించుకుంది. నేను కడప ఎంపీగా నిలబడాలనేది చిన్నాన్న కోరిక. ఆయన కోరిక నెరవేర్చేందుకే కడప ఎంపీ బరిలో దిగుతున్నాను. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని షర్మిల పేర్కొన్నారు.