1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 30 మే 2019 (14:22 IST)

అన్న ప్రమాణస్వీకారానికి పిల్లలతో హజరైన షర్మిల..

హమ్మయ్య షర్మిలమ్మ అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా తన అన్న వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి పిల్లలతో సహా హజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవంలో తన అన్నను సీఎంగా చూసేందుకు ఆమె తన కుమార్తె అక్షిత, కుమారుడు రాజారెడ్డితో కలిసి వచ్చారు. 
 
కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే కనిపించిన షర్మిల, ఎన్నికల ఫలితాల రోజును కానీ, తాడేపల్లిలో జరిగిన లెజిస్టేటివ్ పార్టీ మీటింగ్ రోజున కానీ షర్మిల ఎక్కడా కనిపించలేదు. వై.ఎస్.ఆర్. పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తాడేపల్లిలో జగన్‌ను కలవడంతో పాటు విజయమ్మ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంలో వై.ఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలుద్దామని ప్రయత్నాలు చేసినా షర్మిల ఎక్కడా కనిపించలేదు. 
 
షర్మిల కూడా ఓదార్పుయాత్రతో రాష్ట్రం అంతటా తిరిగి, ఎన్నికల ప్రచార సమయంలో పలుచోట్ల ప్రచారం చేసిన సంగతి తెల్సిందే. జగన్ విజయంలో విజయమ్మ, షర్మిల పోషించిన పాత్ర ఎంతో కీలకం. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత షర్మిల పార్టీ నేతలకు కనిపించకపోవడతో వైసీపీ శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొని ఉంది. అయితే తాజాగా అన్న ప్రమాణ స్వీకారానికి భర్త అనిల్, పిల్లలతో సహా హాజరుకావడంతో పలు అనుమానాలకు సమాధానం దొరికిందని  అంటున్నాయి పార్టీ శ్రేణులు.