గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (19:00 IST)

నాకు ప్రాణహాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత : దస్తగిరి

dasthagiri
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన ఆయన కారు మాజీ డ్రైవర్ దస్తగిరి ప్రాణభయంతో వణికిపోతున్నాడు. గత కొన్ని రోజులుగా బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. 
 
వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో కీలక సాక్షిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ వాపోతున్నాడు. అదేసమయంలో తనకు ఏదేని ప్రాణహాని జరిగితే దానికి బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డి వహించాలని దస్తగిరి వ్యాఖ్యానించారు. 
 
పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనకు ముప్పు తలపెట్టేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 'నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత. ప్రభుత్వ అధికారులంతా సీఎం చెప్పినట్లే వింటారు. అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, జగన్‌ అందరూ ఒకే కుటుంబం. నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. 
 
వివేకా హత్య కేసు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారు. పెద్దవాళ్లనే కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నారు.. వారికి నేను లెక్క కాదు. నాకు ప్రాణ భయం ఉంది.. రక్షణ కల్పించాలి. గన్‌మెన్లను ఎందుకు మార్చారని ఎస్పీకి ఫిర్యాదు చేశా. నా వ్యాఖ్యలు అసత్యాలని ఎస్పీ చెప్పడం బాధాకరం. సమస్య నాది.. ఏం కుట్ర జరుగుతుందో నాకు తెలుసు' అని దస్తగిరి వాపోయారు.