1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (09:07 IST)

నేడు వైఎస్ షర్మిలతో సునీతా రెడ్డి భేటీ.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ?

ys sharmila
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా సోమవారం భేటీ కానున్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో వీరిద్దరు కలుసుకోనున్నారు. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడేందుకు సునీతా అలుపెరగని న్యాయపోరాటం చేస్తున్నారు. సునీతాకు వైఎస్ షర్మిల కూడా తన మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో సునీతా రెడ్డి రాజకీయ ప్రవేశం చేయనున్నారే ప్రచారం గత కొన్ని రోజులుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తనకు వరుసకు సోదరి అయిన వైఎస్ షర్మిలతో డాక్టర్ సునీత భేటీ కానున్నారు. 
 
రాజకీయంగా తాను వేయాల్సిన అడుగులపై షర్మిలతో సునీత చర్చించనున్నట్టు సమాచారం. ఈ భేటీలో సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి భేటీ తర్వాత ఏదైనా ప్రకటన చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సివుంది. వివేకా హత్య కేసు నేపథ్యంలో సీఎం జగన్‌తో సునీత దూరం పెరిగిపోన విషయం తెల్సిందే. మరోవైపు, తండ్రి హత్యపై సునీత చేస్తున్న న్యాయపోరాటంలో షర్మిల కూడా అండగా నిలిచారు. 
 
ఇదిలావుంటే, అనంతపురం జిల్లా పర్యటనలో షర్మిల మాట్లాడుతూ, అనంతపురం జిల్లా అంటే తన తండ్రి వైఎస్ఆర్‌కు ప్రియమైన జిల్లా. ఈ జిల్లా కరువు జిల్లా. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో రెండో స్థానం. ఈ ప్రజలను బ్రతికించుకోవాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గం అని తన తండ్రి బలంగా నమ్మాడు. ఉపాధి హామీ పథకం ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. వైఎస్ఆర్ హయాంలో ఇక్కడ 22 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట వేసేవారు. 'ప్రాజెక్టు అనంత' సృష్టికర్త రఘువీరా రెడ్డి. 
 
గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ అధికారంలో ఉండి 'ప్రాజెక్టు అనంత' గురించి పట్టించుకోలేదు. భారతీయ జనతా పార్టీకి బానిసలుగామారి.. అనంత ప్రాజెక్టు తూట్లు పొడిచారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే.. 6.50 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. 90 శాతం హంద్రీనీవా పనులు వైఎస్ఆర్ పూర్తి చేశారు. మిగిలిన 10 శాతం పనులు జగనన్న పూర్తి చేయలేక పోయాడు. హంద్రీనీవా కోసం జల దీక్ష కూడా చేసి 6 నెలల్లో పూర్తి చేస్తానన్న హామీని మరిచాడు. ఇది నా పుట్టిల్లు ..ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి .. ఇక్కడ ప్రజల హక్కులు హరిస్తున్నారు కాబట్టి ఏపీ రాజకీయాల్లోకి వచ్చాను.