చెత్త సేకరణ వాహనాలకూ వైసిపి రంగులు... సోమువీర్రాజు ఆగ్రహం
స్వచ్చ భారత్ పథకంలో భాగంగా నరేంద్రమోదీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు నిధులు రాష్ట్రాలకు పంపిస్తోందని, ఆ నిధులతో పొడి చెత్త, తడిచెత్త సేకరణకు కొత్తగా మంజూరు చేసిన వాహనాలకూ వైసిపి రంగులు వేయడంపై ఎపి బిజెపి శాఖ మండిపడింది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించాలని న్యాయ స్ధానాలు ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంటే, తిరిగి కేంద్రం నిధులతో కొనుగోలు చేసిన వాహనాలకు పార్టీ రంగులు వేయడాన్నిభారతీయ జనతా పార్టీ సీరియస్ గా తీసుకుంది.
గాంధీ జయంతి సందర్భంగా మంజూరు చేస్తున్న వాహనాలను ఎపి బిజెపి ఆధ్యక్షుడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విజయవాడలోని స్టేడియంలో ఉన్నవాహనాలను ఆయన పరిశీలించిన తరువాత వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసిపి మంత్రులు తిట్టడంలో దిట్టలు తప్ప, అభివ్రుద్ది శూన్యమన్నారు. కేంద్రం ఇస్తున్న పధకంలో కొనుగోలు చేసిన వాహనాలకు స్వచ్చ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఛాయా చిత్రాలను ఏర్పాటు చేయాలని, క్లియర్ గా కేంద్రం నిధులుతో వచ్చిన వాహనాలుగా ప్రజలకు తెలిసేవిధంగా వాహనాల రూపం ఉండాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వాహనాలపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై సోమువీర్రాజు తీవ్ర స్ధాయిలో ధ్వజెమెత్తారు. రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి, డబుల్ స్టిక్కర్ వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు.
స్వచ్ఛ భారత్ కింద కేంద్రం రూ. 1,015 కోట్ల నిధులను రాష్ట్రానికి కేటాయించిందని సోమువీర్రాజు వివరించారు. గ్రామ సచివాలయాలకు రంగులేసి కోర్టుతో ప్రభుత్వం చీవాట్లు తిన్నా, వైసిపి ప్రభుత్వానికి బుద్ది రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మీడియా ఇన్ ఛార్జి లక్ష్మీపతిరాజా, జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శులు ఆర్ముగం, భోగవల్లి శ్రీధర్, ఒబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు శివకుమార్ పట్నాయక్, బిజెపి నేతలు తోట శివనాగేశ్వరరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.