ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (09:33 IST)

నా భర్త పార్టీ మారితే నేనూ మారతా : వైకాపా ఎమ్మెల్యే సుచరిత

sucharita
ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎమ్మెల్యే సుచరిత, ఆమె భర్త పార్టీ మారబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై సుచరిత ఓ క్లారిటీ ఇచ్చారు. తన భర్త పార్టీ మారితో తాను మారుతానని చెప్పారు. పైగా, ఒక భార్యగా తన భర్త అడుగు జాడల్లో నడుస్తానని చెప్పారు. అయితే, తామంతా వైకాపా కుటుంబ సభ్యులమని చెప్పారు. గుంటూరు జిల్లా కాకుమానూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని పై విధంగా వ్యాఖ్యానించారు. 
 
ఏపీ మాజీ హోం మంత్రిగా విధులు నిర్వహించిన సుచరిత.. ప్రత్తిపాడు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తాము ఎపుడూ జగన్‌తోనే ఉంటామని చెప్పారు. తాను చెప్పిన దానికి తన భర్త దయాసాగర్ కూడా కట్టుబడి వుంటారన్నారు. ఒకవేళ తన భర్త పార్టీ మారతాను.. నీవు కూడా నాతో రా అని పిలిస్తే.. ఒక భార్యగా తాను కూడా ఖచ్చితంగా తన భర్త అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు. 
 
తన భర్త ఒక పార్టీలో, తాను మరో పార్టీలో, తన పిల్లలు ఇంకో పార్టీలో ఉండమన్నారు. తామంతా వైకాపా కుటుంబ సభ్యులమన్నారు. జగన్ పార్టీలో తాము ఉండగలిగినంత కాలం ఉంటామని చెప్పారు. కాగా, ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో సుచరితను హోం మంత్రి పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి ఆమె వైకాపాకు అంటీఅంటనట్టుగా ఉంటున్నారు. ఇపుడు బీజేపీలో చేరేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టు సమాచారం.