మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (18:04 IST)

నీది నోరా తాటిమట్టా బాబు? చంద్రబాబుపై విజయసాయి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు విమర్శలదాడి చేశారు. నీది నోరా తాటిమట్టా బాబూ అంటూ కడిగిపారేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఉపాధి లభించక పలువురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా బలవన్మరణాలకు పాల్పడిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. 
 
దీనిపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. అది నోరా తాటిమట్టా బాబా? అని ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. మీ ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తిన్నది అరక్క చస్తున్నారని నీచంగా వ్యాఖ్యానించావు. పరిహారం డబ్బు కోసమే ప్రాణాలు తీసుకుంటారని హేళన చేశావు. కాగా ఇప్పుడు ఎవరో వ్యక్తిగత కారణాలతో చనిపోతే రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలంటున్నావు. నీది నోరా తాటిమట్టా బాబు? అని చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు.