సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (17:19 IST)

మాన్సాస్ ట్రస్ట్ భూములపై వైకాపా గద్దల కన్నుపడింది : చంద్రబాబు

విజయనగరం జిల్లాలో పూసపాటి వంశీయులు నెలకొల్పిన మాన్సాన్ ట్రస్టుకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే భూములపై వైసీపీ గద్దల కన్నుపడిందనీ, ఈ భూములను కాజేసేందుకు వైకాపా పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. 
 
"నమాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన రూ.1.30 లక్షల కోట్ల విలువైన భూములపై వైసీపీ ప్రభుత్వం కన్నేసింది. ఈ భూములు కాజేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
'మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు.
 
అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువ చేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక్ గజపతిరాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి' అని చెప్పారు. అలాగే, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మాట్లాడుతున్న వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.