మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బంధుమిత్రులు తరచు రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖులో చర్చలు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయాలి. బుధవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. విమర్శలు పట్టించుకోవద్దు. ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సోమ, మంగళవారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. గృహమార్పు సత్ఫలితమిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికం.
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదములు
మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం సర్దుబాటవుతుంది. గురు, శుక్రవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఏది జరిగినా మంచికేనని భావించండి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. యత్నాలకు మీ శ్రీమతి ప్రోత్సాహం ఉంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతను చాటుకుంటారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వేడుకకు హాజరవుతారు.
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఈ వారం యోగదాయకం. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు చేరువవుతారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది, దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి, స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అనివార్యం. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులు, బిల్డర్లకు ఆదాయాభివృద్ధి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. పెట్టుబడుల విషయంలో పునరానలోచన శ్రేయస్కరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులతో సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ప్రతికూలతలు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. కుటుంబీకుల మధ్య అప్యాయత నెలకొంటుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ మంటపాలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆది, సోమవారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఉపాధ్యాయులకు చికాకులు అధికం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం.
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారదక్షతతో రాణిస్తారు. కష్టానికి తగ్గ గుర్తింపు ఉంటుంది. ప్రముఖులతో పరిచాలేర్పడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది.. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. మంగళ, బుధవారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. చిన్న విషయయే సమస్యగా మారే ఆస్కారం ఉంది. ఆత్మీయుల రాక ఉపశమననం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. విదేశీయానానికి మార్గం సుగమమవుతుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కొత్త వ్యాపారాలకు తరుణం కాదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. ఆస్తి వివాదాలు సద్దుమణుగుతాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ప్రతికూలతలను అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. రాబోయే ఆదాయాననికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. గురువారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వృత్తుల వారికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. రిప్రజెంటేటివ్లకు ఒత్తిడి అధికం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు కష్ట సమయం.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. నిరుద్యోగులకు శుభయోగం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు సాననుకూలమవుతాయి. సోమ, మంగళ వారాల్లో విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
చాకచక్యంగా మెలగాలి. పట్టుదలకు పోవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. కొంతమొత్తం ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. ఆలోచనలతో సతమతమవుతారు. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. గృహ వాస్తుదోష నివారణ చర్యలు తప్పనిసరి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. న్యాయ, సాంకేతిక, అకౌంట్స్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.