నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు: నలుగురు ఆందోళనకారులు మృతి
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్ వెళ్లారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. చట్‌గావ్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు- పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతిచెందారు. ఘర్షణల్లో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ వారు చికిత్స పొందుతూ చనిపోయారని ఒక పోలీస్ బీబీసీ బంగ్లాకు చెప్పారు.
ఢాకాలోనూ నిరసనలు
ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్రార్థనల తర్వాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బైతుల్ ముకర్రమ్ ప్రాంతంలో నిరసనలు చేపట్టారు. అక్కడ కూడా పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. చాలామంది గాయపడ్డారు. వారిలో విలేఖరులు కూడా ఉన్నారు. చట్‌గావ్‌లో శుక్రవారం ప్రార్థనల తర్వాత హథాజరీ మదర్సా నుంచి నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత హింసాత్మక ఘర్షణలు జరిగినట్లు స్థానిక మీడియా చెప్పింది.
పోలీసులతో జరిగిన ఘర్షణల్లో చాలామంది గాయపడ్డారని తెలిపింది. "గాయపడి ఆస్పత్రికి తీసుకొచ్చిన వారిలో నలుగురు చనిపోయారు" అని చట్‌గావ్ మెడికల్ కాలేజీ అధికారి ఒకరు పేరు బయటపెట్టద్దనే షరతుతో బీబీసీకి చెప్పారు. తమ సంస్థకు చెందిన కొందరు నిరసనకారులు చనిపోయారని హిఫాజత్-ఎ-ఇస్లాం సంస్థ నేత మజీబుర్ రహమాన్ హామిదీ ధ్రువీకరించారు. పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని హమీదీ ఆరోపించారు. అయితే బీబీసీ దీనిని స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.
పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వారు
నిరసన ప్రదర్శనల సమయంలో కొంతమంది హథాజరీ పోలీస్ స్టేషన్ మీద రాళ్లు రువ్వినట్లు పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని ఢాకాలోని స్థానిక మీడియా చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వ్యతిరేకంగా అక్కడున్న కొందరు ముస్లిం నేతలు, వామపక్ష సంస్థలు ఆందోళనలు చేపడుతున్నాయి.
షేక్ ముజీబుర్ రహమాన్ ఒక లౌకిక దేశం కోసం పోరాడారని, మోదీ మతతత్వవాది అని వారు ఆరోపిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానంతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఢాకా వెళ్లారు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లవడం, షేక్ ముజీబుర్ రహమాన్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన అక్కడికి వెళ్లారు.