అమ‌రావ‌తి ప్రాజెక్టు నుంచి సింగ‌పూర్ క‌న్సార్టియం ఎందుకు వైదొలిగింది?

ఠాగూర్| Last Updated: బుధవారం, 13 నవంబరు 2019 (17:15 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని న‌గ‌ర వ్య‌వ‌హారం ఆస‌క్తికరంగా మారుతోంది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిపై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ సాగిస్తోంది. రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణంపై నిర్ణ‌యం కోసం క‌మిటీని కూడా నియ‌మించింది. ఆ క‌మిటీ నివేదికను రూపొందించే పనిలో ఉంది. అది ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన త‌ర్వాత అమ‌రావ‌తి భ‌విత‌వ్యంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెబుతోంది.
 
ఈలోగానే సింగ‌పూర్ క‌న్సార్టియం అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అమ‌రావ‌తి స్టార్ట‌ప్ ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తొలుత అధికారికంగా త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.
 
చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం... 
అమ‌రావ‌తి రాజ‌ధాని న‌గ‌ర అభివృద్ధిలో భాగంగా తొలుత‌ స్టార్ట‌ప్ ఏరియా అభివృద్ధి కోసం సింగ‌పూర్ క‌న్సార్టియంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో ఒప్పందం జ‌రిగింది. అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అండ్ సెంబ్ కార్ప్ కార్పొరేష‌న్ సంస్థ‌లు క‌న్సార్షియంగా ఏర్ప‌డి సీఆర్‌డీఏ ఆధ్వ‌ర్యంలోని అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ కంపెనీతో 2017 మే 15న ఈ ఒప్పందం చేసుకున్నాయి.
 
నాటి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్ స‌మ‌క్షంలో ఈ ఒప్పందంపై సంత‌కాలు జ‌రిగాయి. స్టార్టప్ ఏరియా ఒప్పందం ప్ర‌కారం.. రాబోయే 15 ఏళ్ల‌లో మూడు ద‌శ‌లుగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అందుకోసం 6.84 చ‌దరపు కిలోమీట‌ర్ల ప‌రిధిలోని 1,691 ఎక‌రాల‌ను గుర్తించారు.
 
తొలుత 2022 నాటికి అంటే రాబోయే ఐదేళ్ల‌లో 656 ఎక‌రాలను అభివృద్ధి చేస్తామ‌ని ఒప్పందం చేసుకున్నారు. వీటిలో 170 ఎక‌రాలు న‌దీ తీరంలో ఉన్నాయి. అందులో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం సీఆర్‌డీఏ రూ.2,118 కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.
 
ఆదాయంలో 52 శాతం వాటా సింగ‌పూర్ క‌న్సార్టియం తీసుకుంటుంది. మిగిలింది సీఆర్‌డీఏకు ద‌క్కుతుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో 1.25 ల‌క్ష‌ల కుటుంబాలు అమ‌రావ‌తిలో స్థిర‌ప‌డ‌తాయ‌ని, 15 ఏళ్ల‌లో 2.5 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని నాడు ప్రభుత్వం ప్ర‌క‌టించింది.
 
అలా స్టార్ట‌ప్ ఏరియా అభివృద్ధి ద్వారా 1.15 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్ర‌భుత్వానికి ద‌క్కే అవ‌కాశం ఉంటుంద‌ని, ఏటా 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయ‌లు ప‌న్నుల రూపేణా ప్ర‌భుత్వానికి చేర‌తాయ‌ని చెప్పింది.
 
గ‌డిచిన రెండున్న‌రేళ్ల‌లో ఏం జ‌రిగింది..? 
అమ‌రావ‌తి స్టార్ట‌ప్ ఏరియాల అభివృద్ధిలో భాగంగా 1,604 కిలోమీట‌ర్ల పొడవునా రోడ్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. వాటిలో 697 కిలోమీట‌ర్ల పొడ‌వునా సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణం ప్రారంభమై ప్ర‌స్తుతం వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి. అలాగే 2,354 కిలోమీట‌ర్ల పొడవైన వాట‌ర్ పైప్ లైన్ నిర్మాణం చేయాల‌ని భావించి 831 కిలోమీట‌ర్ల పైప్ లైన్ నిర్మాణం ప్రారంభించారు.
 
ఎంపిక చేసిన ప్రాంతంలో వివిధ నిర్మాణ కార్య‌క‌లాపాలు గ‌త మార్చి త‌ర్వాత పూర్తిగా స్తంభించాయి. మే నెల‌లో ప్ర‌భుత్వం మార‌డంతో అమ‌రావ‌తి న‌గ‌రంలో కార్య‌క‌లాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. స్టార్ట‌ప్ ఏరియాలో కూడా ముంద‌డుగు లేదు.
jagan
 
ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా జగన్ విమ‌ర్శ‌లు... 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌తంలో ప్రతిప‌క్ష నేత‌గా ఈ ఒప్పందంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. స్టార్ట‌ప్ ఏరియా కోసం సింగ‌పూర్ క‌న్సార్టియంతో చేసుకున్న ఒప్పందాన్ని త‌ప్పుపడుతూ అమ‌రావ‌తిలో భూ కేటాయింపుల తీరులో పెద్ద స్థాయిలో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. తాము అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తి కోసం చేసుకున్న ఒప్పందాల‌ను స‌మీక్షిస్తామ‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.
 
ఇక అధికారంలోకి వ‌చ్చిన తర్వాత దానికి అనుగుణంగానే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపించింది. ముఖ్యంగా అమ‌రావ‌తి న‌గ‌రంలో నిర్మాణాల పనులు దాదాపుగా నిలిపివేసింది. అదే స‌మ‌యంలో మంత్రులు ప‌లు సంద‌ర్భాల్లో కీల‌క ప్ర‌క‌ట‌నలు కూడా చేశారు. రాజ‌ధాని విష‌యమై పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపారు.
 
ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి బొత్సా స‌త్య‌న్నారాయ‌ణ రాజ‌ధానిగా అమ‌రావ‌తిపై ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేస్తుంద‌ని, అక్క‌డ నిర్మాణాల‌కు ఖ‌ర్చు ఎక్కువ‌ని, వ‌ర‌ద ముప్పు కూడా ఉందని ప‌దే ప‌దే ఈ అంశంపై మాట్లాడుతున్నారు.
 
సింగ‌పూర్ ఒప్పందం నుంచి వైదొల‌గాల‌ని నిర్ణ‌యం... 
సింగ‌పూర్ క‌న్సార్టియం ప్ర‌తినిధులు గ‌త అక్టోబ‌ర్ నెల మొద‌టి వారంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం ఏపీ క్యాబినెట్ స‌మావేశమైంది. సింగ‌పూర్ క‌న్సార్టియంతో చేసుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని తీర్మానించింది.
 
అందుకు అనుగుణంగానే తాజాగా సింగ‌పూర్ ప్ర‌భుత్వం త‌రపున అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఒప్పందం నుంచి వైదొలగినట్టు సింగపూర్ ప్ర‌భుత్వం త‌రపున మంత్రి ఈశ్వ‌ర‌న్ తెలిపారు. పరస్పర అవగాహనతో వైదొలగుతున్నట్లు అధికారిక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.
amaravati
 
భవిష్యత్తులో కలిసి పని చేస్తామని ఆశాభావం కూడా వ్య‌క్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల భారత్, ఏపీలలో సింగపూర్ వాణిజ్య సంస్థల పెట్టుబడులపై ప్రభావం ఉండదని పేర్కొన్నారు. పెట్టుబడి సంస్థలు లాభనష్టాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్తాయని, అమరావతిలో పెట్టుబడుల ప్రభావం కొంత మేరకే ఉంటుందని తెలిపారు.
 
''క‌మిటీ నివేదిక ఆధారంగా ముందుకెళతాం...'' 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విష‌యంలో క‌మిటీ రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ‌తామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ''సింగ‌పూర్ క‌న్సార్టియంతో చేసుకున్న ఒప్పందాల విష‌యంలో ప్ర‌భుత్వం స్ప‌ష్టంగా ఉంది. అమ‌రావ‌తి న‌గ‌రం విష‌యంలో ఏం చేయాల‌న్న‌ది జీఎన్ రావు క‌మిటీ రిపోర్ట్ త‌యారు చేస్తోంది. ప్ర‌జ‌ల నుంచి, రాజ‌ధాని ప్రాంత రైతుల నుంచి అభిప్రాయాలు సేక‌రిస్తోంది. నేటితో ఆ క‌మిటీకి గ‌డువు ముగుస్తోంది'' అని చెప్పారు.
 
''నిపుణుల క‌మిటీ ఏం చెబుతున్న‌ది చూడాలి. ఆ త‌ర్వాత క్యాబినెట్ తుది నిర్ణ‌యం తీసుకుంటుంది. సింగ‌పూర్ క‌న్సార్షియంతో ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకోవాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత వెలువ‌డిన ఉత్త‌ర్వుల ప్ర‌కార‌మే సింగ‌పూర్ తాజా ప్ర‌క‌ట‌న‌ చేసింది. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వారు ఆస‌క్తిగానే ఉన్నారు. అంద‌రినీ ఆహ్వానించి, మ‌రింత మెరుగైన రీతిలో రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణం జ‌రిగేందుకు ప్ర‌య‌త్నం చేస్తాం'' అని వివ‌రించారు.
 
''రాజ‌ధాని నగరాన్ని కలగా మార్చేశారు...'' 
ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణం కోసం ఐదేళ్ల పాటు చంద్ర‌బాబు పడిన క‌ష్టాన్ని నీరుగార్చేశార‌ని టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వ్యాఖ్యానించారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ''సింగ‌పూర్ ప్ర‌భుత్వ స‌హ‌కారంతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప‌ద్ధ‌తిలో రాజ‌ధాని నిర్మాణం కోసం ప్ర‌య‌త్నం చేశాం. రైతుల త్యాగాల‌తో ముందుకు వెళ్లాం. కేంద్రం స‌హ‌క‌రించినా లేకపోయినా సొంతంగా రాజ‌ధాని నిర్మించాల‌ని ఎంతో శ్ర‌మ ప‌డ్డాం. స్టార్టప్ ఏరియా ద్వారా అభివృద్ధి కోసం అడుగులు వేస్తే ఇప్పుడు ఆటంకాలు పెట్టి ఒప్పందాలు ర‌ద్దు చేసుకోవ‌డం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతుంది'' అని విమర్శించారు.
 
''ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ బ్యాంక్, ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ వంటివి వెన‌క్కిపోయాయి. ఎస్‌బీఐ స‌హా ఎవ‌రూ రుణాలు ఇవ్వ‌డానికి ముందుకు రాలేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాజ‌ధాని న‌గ‌రం క‌ల‌గా మార్చేస్తున్నారా అన్న అనుమానం వ‌స్తోంది. రాష్ట్రంలో రివ‌ర్స్ పాల‌న సాగించ‌డం బాధాక‌రం'' అని పేర్కొన్నారు. 

దీనిపై మరింత చదవండి :