ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 11 ఆగస్టు 2022 (20:42 IST)

సంపన్నులు ఎగ్గొట్టిన రుణాల వల్లే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయా? గత 5 ఏళ్లలో రూ.10 లక్షల కోట్లు రైటాఫ్ చేసిన బ్యాంకులు, ఈ నష్టాన్ని భరించేది ఎవరు?

sarkaru vari paata
సర్కారు వారి పాట... మహేశ్ బాబు నటించిన ఈ సినిమాలో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఎగ్గొట్టే వారి గురించి చూపించారు. ఈ సినిమాలోని విలన్ రాజేంద్రనాథ్‌ (సముద్రఖని) ఒక బ్యాంక్‌కు రూ.10 వేల కోట్లు బాకీ ఉంటాడు. తిరిగి తీర్చగల స్తోమత ఉన్నప్పటికీ ఆయన తీర్చడు. అంటే ఆయన కావాలనే అప్పు ఎగ్గొట్టాడు. ఇలా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకుని కావాలని ఎగ్గొట్టే వారిని 'విల్‌ఫుల్ డిఫాల్టర్స్' అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) పిలుస్తోంది.

 
'సర్కారు వారి పాట'లో భయపెట్టో బెదిరించో రాజేంద్రనాథ్ బాకీ తీర్చేలా చేస్తాడు హీరో. అది సినిమా కానీ వాస్తవ జీవితంలో అలా జరగదు కాబట్టి, భారత్‌లో కావాలనే రుణాలు ఎగవేసే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.లక్షల కోట్లలో రుణాలను రైటాఫ్ చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సామాన్య ప్రజల విషయంలో కఠినంగా వ్యవహరించే ప్రభుత్వం, భారీ మొత్తంలో రుణాలు తీసుకుని ఎగవేసే వారిని వదిలేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. చిన్నచిన్న మొత్తాలు లోను తీసుకునే సామాన్యుల విషయంలో వాయిదాలు కట్టలేకపోతే రికవరీ ఏంజెట్లను పంపించే బ్యాంకులు... రాజకీయనాయకులు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలు వంటి వారి విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నాయనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.

 
'10 ఏళ్లలో రూ.2.4 లక్షల కోట్లు'
దేశంలోని బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు కావాలనే ఎగవేశారు. '2012 మార్చి 31 నాటికి ఇలా ఎగవేసిన బాకీల విలువ రూ.23 వేల కోట్లు. అది 2022 మార్చి 31 నాటికి రూ.2.4 లక్షల కోట్లకు చేరింది' అని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.

 
2021లో 2,840 ఖాతాలు
రూ.5 కోట్ల కంటే ఎక్కువ రుణం తీసుకుని తిరిగి చెల్లించని ఖాతాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆర్‌బీఐకి బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు వంటివి ఇస్తుంటాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం బ్యాంకుల నుంచి బాకీలు తీసుకుని కావాలనే ఎగవేసిన ఖాతాల సంఖ్య గత నాలుగేళ్లలో 10 వేలు దాటింది.

 
టాప్‌లో ఎస్‌బీఐ
బ్యాంకులకు అత్యధికంగా బాకీలు ఎగవేసిన జాబితాలో ఎస్‌బీఐ టాప్‌లో ఉంది. ఎస్‌బీఐకి ఎగవేసిన బాకీల విలువ రూ.67,304 కోట్లు. రూ.37,662 కోట్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో స్థానంలో ఉండగా రూ.26,540 కోట్లతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానంలో ఉంది. ఈ మూడు బ్యాంకులకు కలిపి సుమారు రూ.1.07 లక్షల కోట్లు ఎగవేశారు.

 
మెహుల్ చోక్సీ రూ.7,110 కోట్లు ఎగవేత
బ్యాంకులకు కావాలనే బాకీలను ఎగవేసిన టాప్-25 కంపెనీల జాబితాను కేంద్ర ఆర్థికశాఖ రాజ్యసభకు వెల్లడించింది. గుజరాత్‌ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.7,110 కోట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీల్లికి చెందిన ఇరా ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్(రూ.5,879 కోట్లు), పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాన్కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(రూ.4,107 కోట్లు) ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. మొత్తం మీద ఈ టాప్-25 కంపెనీలు సుమారు రూ.59 వేల కోట్లు బ్యాంకులకు కావాలనే ఎగవేశాయి.

 
రూ.6.42 లక్షల కోట్లు వసూలు
ప్రభుత్వరంగ బ్యాంకులు మొండి బకాయిలు, రైటాఫ్ చేసిన లోను ఖాతాల నుంచి గత 8 ఏళ్లలో ఇప్పటి వరకు సుమారు రూ.6.42 లక్షల కోట్లు వసూలు చేశాయని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. అయితే రైటాఫ్ చేస్తున్న రుణాల గురించి మాత్రమే మాట్లాడుతన్న ప్రతిపక్షాలు బ్యాంకులు రికవరీ చేస్తున్న లోన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ కొందరు రాజకీయనేతలు విమర్శిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని విమర్శిస్తూ వైసీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

 
5 ఏళ్లలో సుమారు రూ.10 లక్షల కోట్లు రైటాఫ్
గత అయిదేళ్లలో అంటే 2017-18 నుంచి 2021-22 మధ్య రూ.9.91 లక్షల కోట్లను బ్యాంకులు రైటాఫ్ చేసినట్లు రాజ్యసభకు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇచ్చిన బాకీలను వసూలు చేసేందుకు అన్ని మార్గాలను అనుసరించిన తరువాత కూడా అప్పు తీర్చకుంటే దాన్ని బ్యాంకులు రైటాఫ్ చేస్తాయి. ఉదాహరణకు A కంపెనీకి 1,00,000 లోను ఇచ్చారని అనుకుందాం. ఆ లక్ష రూపాయలు బ్యాంకు దృష్టిలో ఆస్తి. అప్పు తీసుకున్న కంపెనీ కట్టే వడ్డీ బ్యాంకుకు వచ్చే ఆదాయం. అందువల్ల బ్యాలెన్స్ షీట్‌లో కస్టమర్లకు ఇచ్చిన రుణాలను ఆస్తులుగా చూపిస్తారు.

 
కారణాలు ఏమైనా కావొచ్చు A కంపెనీ నెలనెలా వాయిదాలు కట్టలేకపోతోంది. అయినా కూడా తన బ్యాలెన్స్ షీట్‌లో ఆ లోను ఖాతాను అసెట్‌గానే బ్యాంకు చూపిస్తుంది. భవిష్యత్తులో ఏదో ఒకరోజు డబ్బులు కడతారనే ఉద్దేశంతో అలా చేస్తారు. రుణాలను రీస్ట్రక్చర్ చేయడం, రాయితీలు ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నా కూడా A కంపెనీ పూర్తిగా బాకీ తీర్చలేదు. రోజులు గడుస్తున్నా ఎంతకూ బాకీ వసూలు కాకపోతే ఆర్‌బీఐ నియమాల ప్రకారం ఆ ఆస్తిని నష్టంగా చూపిస్తూ బ్యాలెన్స్ షీట్ నుంచి బ్యాంకు తొలగిస్తుంది. అంటే A కంపెనీకి ఇచ్చిన రుణం వస్తే వస్తుంది. లేదంటే లేదు. బ్యాంకుకు సంబంధించినంత వరకు Aకి ఇచ్చిన రుణాన్ని నష్టపోయినట్లే. ఇలా చేయడాన్నే రైటాఫ్ అంటారు.

 
రైటాఫ్ చేస్తే ఇక బాకీలు వసూలు కావా?
రైటాఫ్ చేసినంత మాత్రాన అప్పు మాఫీ అయినట్లు కాదు. A అనే కంపెనీ డబ్బులు తిరిగి కట్టే వరకు బ్యాంకుకు రుణపడే ఉంటుంది. డబ్బులు రాబట్టుకునేందుకు ఏదో ఒక మార్గంలో బ్యాంకులు ప్రయత్నిస్తూనే ఉంటాయి.

 
రైటాఫ్ వల్ల కలిగే నష్టాలు
బ్యాంకుల లాభాలు తగ్గడంతోపాటు నష్టాలు కూడా రావొచ్చు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది.
తరచూ నష్టాల్లో ఉండే బ్యాంకులు, మొండి బకాయిలను కట్టడి చేయలేకపోతే దీర్ఘకాలంలో వాటి మనుగడే ప్రమాదంలో పడుతుంది.
బ్యాంకులు దెబ్బతినడం వల్ల ఆర్థికవ్యవస్థ బలహీనపడుతుంది.

 
ఇతర డిపాజిటర్ల మీద భారం పడుతుందా?
వేల కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ చేయడం వల్ల ఇతర డిపాజిటర్ల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మొండి బకాయిలు ఎక్కువగా ఉండటం, అధిక స్థాయిలో రుణాలు రైటాఫ్ చేయడం వంటి కారణాల వల్ల బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. అప్పుడు ఆదాయం పెంచుకునేందుకు బ్యాంకులు కొత్తగా జారీ చేసే రుణాల మీద వడ్డీ రేట్లు పెంచుతాయి. లేదంటే డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీని తగ్గిస్తాయి. ఇంకా సంక్షోభం ముదిరితే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని మూలధనం సమకూర్చాల్సి వస్తుంది.

 
ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు?
మొండి బకాయిలు పేరుకుపోవడం, రుణాలను రైటాఫ్ చేయడం వంటి వాటి వల్ల బ్యాంకులు తీవ్రంగా నష్టపోతాయి. అత్యధిక నిరర్థక ఆస్తులు ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి. అవే ఎక్కువగా రుణాలు రైటాఫ్ చేస్తుంటాయి. ఇలా సంక్షోభంలో పడిన బ్యాంకులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తూ ఉంటుంది. అంటే పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఇలా బ్యాంకులకు పంప్ చేస్తుంది. అంటే ప్రజల డబ్బును ఇస్తుంది. తద్వారా తగిన నిధులు లేక అభివృద్ధి కార్యకలాపాలు తగ్గిపోతాయి. ఫలితంగా ఉపాధి కల్పన జరగదు. అంటే తగిన ఉద్యోగాలు కూడా దొరకవు.