మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (14:18 IST)

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో... ఏపీకి ఏమిస్తామని చెప్పారో చూస్తే షాకవుతారు...

కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తోంది. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని, సంక్షేమం అందిస్తామని అన్నారు.
 
రైతులు, యువత, మహిళలు, పేదలు, దేశ రక్షణ, పారిశ్రామిక రంగం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చిదంబరం చెప్పారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలనే తీసేసిందని విమర్శించారు. ఎన్టీఏ ప్రభుత్వం హయాంలో 4.7 కోట్ల ఉద్యోగాలు పోయాయని చిదంబరం అన్నారు. సగటున ప్రతి రైతు మీద లక్షా 4 వేల రుణభారం పెరిగిందన్నారు.
 
లక్షల మంది ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేశామని చిదంబరం చెప్పారు. వివిధ వర్గాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టోను రూపొందించామని మన్మోహన్ సింగ్ తెలిపారు. 2030 నాటికి దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తామన్నారు.
 
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదీ ప్రస్తావన
ప్రజల ఆకాంక్షల మేరకు మేనిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. తమ మేనిఫెస్టో ఒక గదిలో కూర్చుని రూపొందించింది కాదని, ప్రజల మనసులోని ఆలోచనలను ప్రతిబింబించేలా తమ మేనిఫెస్టో ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు.
 
రాహుల్ ఇంకా ఏం చెప్పారంటే.. న్యాయ్ పథకం కింద పేదల ఖాతాల్లో ఏటా రూ.72 వేలు జమ చేస్తాం. దేశంలో దాదాపు 20 శాతం మంది ప్రజలు ఈ పథకం కిందకు వస్తారు. అయిదేళ్లలో రూ.3.6 లక్షల చొప్పున పేదల ఖాతాల్లో నేరుగా జమ చేస్తాం. ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ మోసం చేశారు. 2020 మార్చి నాటికి 22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గ్రామ పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
 
ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచుతాం. నోట్లను రద్దు చేయడం ద్వారా నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, చోక్సీ లాంటి వారు కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి పారిపాతే వారిపై మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రుణాలు తిరిగి చెల్లించని రైతులను జైళ్లో పెడుతున్నారు.
 
గబ్బర్ ట్యాక్స్ (జీఎస్టీ) తీసుకొచ్చి చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టారు. ఇన్నాళ్లూ వ్యాపారం ప్రారంభించాలంటే ఎన్నో రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారాలు చేసుకునేందుకు ఎలాంటి అనుమతి అవసరం ఉండదు. రైల్వే బడ్జెట్ మాదిరిగానే వ్యవసాయ రంగం కోసం కూడా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి. చౌకీదార్ (కాపలాదారుడు) దొంగగా మారారు.
 
2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీ ప్రకారం, మేము అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తాం. విద్య కోసం జీడీపీలో 6 శాతం ఖర్చు చేస్తాం. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తాం. జాతీయ, అంతర్గత భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం.