శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 16 ఏప్రియల్ 2020 (15:21 IST)

కరోనావైరస్: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తప్ప.. ఏపీ అంతా హాట్‌స్పాట్

ఆంధ్ర ప్రదేశ్‌‌లో 11 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించినట్టు కేంద్రం బుధవారం ప్రకటించిందంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారిన జిల్లాల్లో ప్రత్యక్ష కార్యాచరణ అమలుపై కేంద్రం దృష్టి సారించింది.

 
అందులో భాగంగా దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించింది. కేంద్రం ప్రకటించిన హాట్‌స్పాట్‌లన్నీ రెడ్‌జోన్‌ పరిధిలోకి వచ్చేవే. ఈ జాబితాలో ఏపీ నుంచి కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.

 
ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదుకాని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రం సేఫ్‌జోన్‌లో ఉన్నాయి. 20కిపైగా కేసులు నమోదైన ప్రతి జిల్లాను హాట్‌స్పాట్‌గా.. అందులోనూ అత్యధిక కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు. అయితే, ఏపీలో క్లస్టర్‌ ప్రస్తావన లేదు. అంటే మొత్తం 11 జిల్లాలు హాట్‌స్పాట్‌ క్లస్టర్లుగానే భావించాల్సి ఉంటుంది. క్లస్టర్‌ అంటే జిల్లాలో కేసుల సంఖ్య భారీగా ఉన్న ప్రాంతాలతో కూడిన సముదాయం.

 
ఈ నెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన మినహాయింపులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మాత్రమే వర్తిస్తాయని ఆంధ్రజ్యోతి ఈ కథనంలో వివరించింది.