శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 13 ఏప్రియల్ 2020 (22:42 IST)

కరోనావైరస్: ప్రపంచ నాయకత్వం అమెరికా నుంచి చైనా చేతుల్లోకి వెళ్తోందా?

కరోనావైరస్ ప్రభావం ఘోరంగా ఉన్న దేశాల్లో స్పెయిన్ ఒకటి. దానికి, ముఖ్యంగా కోవిడ్-19 కేసులు అత్యధికంగా బయటపడిన ప్రాంతాలకు వైద్య వనరులు, పరికరాలు, మందులు చాలా అవసరం. కానీ, తమకు అవసరమైన ఈ వైద్య వనరులు సేకరించే స్పెయిన్ ప్రయత్నాలకు, టర్కీ ప్రభుత్వం అడ్డుపడింది. స్పెయిన్‌లోని మూడు హెల్త్ ట్రస్టులు కొనుగోలు చేసిన వందల వెంటిలేటర్లను తీసుకొస్తున్న నౌకలను స్వాధీనం చేసుకుంది. స్పెయిన్ మీడియా టర్కీ చేసిన ఈ పనిని ‘దొంగతనం’గా వర్ణిస్తున్నాయి.

 
దాదాపు ఒక వారం సందిగ్ధత తర్వాత స్పెయిన్ చివరికి తమ మెడికల్ పరికరాలు ఉన్న నౌకలను టర్కీ నుంచి విడిపించుకోగలిగింది. కానీ, కరోనావైరస్ వల్ల ప్రపంచ దేశాల్లో ఎలాంటి దౌత్య ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ.

 
దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
కరోనావైరస్ వల్ల అమెరికా, చైనా మధ్య దౌత్య ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ఆడమన్నట్లు ఆడుతోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపణలు చేసినప్పటి నుంచి ఇది మరింత ఎక్కువైంది. అమెరికా ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓకు ఇస్తున్న నిధులను ఆపేయాలని కూడా ఆలోచిస్తోంది.

 
ఇవి మాత్రమే కాదు, కరోనావైరస్ వల్ల దౌత్యపరంగా తలెత్తిన ఉద్రిక్తతలకు ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. తమ దేశంలో కరోనా కేసుల సంఖ్య దాస్తోందని చైనాపై ఆరోపణలు వస్తున్నా, కోవిడ్-19కు సంబంధించిన ప్రతి దౌత్య ఉద్రిక్తతకు చైనాతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు.

 
“ఈ మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో దీనిని ఉమ్మడి సవాలుగా భావించి పరస్పరం సహకరించుకోవాలని అన్ని దేశాలూ భావించాయి. అప్పుడే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలమని అనుకున్నాయి. కానీ అన్ని దేశాలు తమ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. సహకారానికి బదులు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి” అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్ సోఫియా గాస్టన్ బీబీసీతో అన్నారు.

 
యూరోపియన్ దేశాల ఐక్యతలో చీలికలు రావడం దీనికి ఒక ఉదాహరణ. ఇటలీలో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండడంతో వైద్య వనరులు అందించి సాయం చేయమని ఆ ప్రభుత్వం మిగతా దేశాలను వేడుకుంది. కానీ ఇటలీ పక్కనే ఉన్న రెండు పెద్ద దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్ తమ దేశం నుంచి అలాంటి ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధించాయి.

 
యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం బ్రసెల్స్‌లోని ఇటలీ రాయబారి మారిజియో సమారీ “ఐరోపా దేశాల ఐకమత్యానికి ఇది కచ్చితంగా శుభసంకేతం కాదు” అని పాలిటికో అనే ఒక వెబ్‌సైట్‌లో రాశారు. జర్మనీపై ఇటలీ ప్రజలకు మరో విషయంలో కూడా కోపం వచ్చింది. కరోనా మహమ్మారికి అత్యంత ప్రభావితమైన దేశాలకు సాయం అందించేలా విరాళాలు సేకరించి ఒక ఫండ్ ఏర్పాటు చేద్దామని అనుకున్నప్పుడు, జర్మనీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన దేశాలతో చేతులు కలిపింది.

 
జర్మనీతోపాటు నెదర్లాండ్, ఆస్ట్రియా, ఫిన్‌లాండ్ కూడా కోవిడ్-19 ప్రభావిత దేశాలకు నిధులు సేకరించే ప్రస్తావనను బహిరంగంగా వ్యతిరేకించాయి. స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, యునాన్, ఐర్లాండ్, పోర్చుగల్, స్లొవేకియా, లక్సెంబర్గ్ ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయి.

 
చైనా 'మాస్క్' దౌత్యం
ఇటలీ, చైనా ‘మాస్క్ డిప్లొమసీ’ కూడా దీనికి ఒక ఉదాహరణ. చైనా తమ సరిహద్దుల్లో కరోనావైరస్‌ను నియంత్రించిన తర్వాత, ఇప్పుడు ఈ వైరస్‌ను అడ్డుకోవడానికి ఉపయోగపడవచ్చని నిరూపితమైన ఎన్నో పరికరాలను ఎన్నో దేశాలకు అందిస్తోంది. చైనా ఇలాంటి సాయం రష్యాకు కూడా అందించింది.

 
ఇటలీ కూడా చైనా నుంచి మెడికల్ పరికరాలు, టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసింది. అంతే కాదు, చైనా ఆ దేశానికి తమ డాక్టర్ల బృందాన్ని కూడా పంపింది. వారిని ఇటలీలో ఇప్పుడు హీరోల్లా చూస్తున్నారు. ఇటలీ సోషల్ మీడియాలో #grazieCina (ధన్యవాదాలు చైనా) ఇప్పుడు జోరుగా ట్రెండ్ అవుతోంది. గేసూ ఆంతోనియో బాయెజ్, పాక్స్ టెకమ్ అనే ఒక కన్సల్టెన్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. లండన్‌లో ఉన్న ఈ కంపెనీ దౌత్య, అంతర్జాతీయ అభివృద్ధి అంశాలకు సంబంధించిన సేవలు అందిస్తుంది.

 
“విశ్వ మహమ్మారి ప్రబలిన ఈ సంక్షోభ సమయంలో ఖాళీ అయిన అమెరికా దౌత్య స్థానాన్ని భర్తీ చేయాలని చైనా ఇప్పుడు తెలివిగా ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2016లో పదవిలోకి వచ్చినప్పటి నుంచి 'అమెరికా ఫస్ట్' అనే విధానంలో వెళ్తుండడం వల్లే ఇలా జరిగింది. అయినా, అమెరికా తీరు ఎవరితోనూ సఖ్యంగా ఉన్నట్టు కనిపించడం లేదు. చైనాతో ఉద్రిక్తతలే కాకుండా, పాత మిత్రదేశం జర్మనీలో ఒక కంపెనీ తయారు చేయబోతున్న కోవిడ్-19 టీకా ప్రత్యేక హక్కులు సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన ట్రంప్... ఆ దేశానికి చాలా కోపం కూడా తెప్పించారు. ఇటీవల మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేయకపోతే అమెరికా ప్రతిగా స్పందిస్తుందంటూ భారత్‌ను హెచ్చరించారు. ఎందుకంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కోవిడ్-19 చికిత్సకు కూడా పరీక్షిస్తున్నారు” అంటారు బాయెజ్.

 
“ఈ సంక్షోభ సమయంలో అమెరికా ఒక దౌత్య మహాశక్తిగా జోక్యం చేసుకోలేకపోయింది. అందుకే, అంతర్జాతీయ దౌత్యంలో అమెరికా ఖాళీ చేసిన ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఇప్పుడు చైనాకు దొరికింది” అన్నారు. కానీ, చైనా 'మాస్క్' దౌత్యం విధానం కూడా అంత సులభం కాదు. దానికి బ్రెజిల్ ఒక ఉదాహరణ. కొత్త కరోనావైరస్ వ్యాపిస్తున్న సమయంలో చైనా సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టలేదని ప్రపంచంలోని చాలా దేశాలు గుర్రుగా ఉన్నాయి. అందుకే చైనాపై చాలా దేశాలకు కోపం కూడా ఉందని సోఫియా గేస్టన్ అంటున్నారు.

 
సోషల్ మీడియాలో చైనా, బ్రెజిల్ గొడవ
ఒక అమెరికా నిఘా రిపోర్టును ప్రస్తావించిన సోఫియా.. చైనా తమ దేశంలోని కోవిడ్-19 కేసులు దాస్తోంది అని చెప్పారు. బ్రిటన్ అధికారులు కూడా చైనాలో కరోనా కేసుల లెక్కలపై ప్రశ్నలు లేవనెత్తారు. "చైనాలో కోవిడ్-19 కేసుల గణాంకాలపై ప్రశ్నలు వస్తున్న సమయంలో అక్కడి యంత్రాంగం తమ దేశం ఇమేజ్‌ను మెరుగుపరచుకునే పనిలో ప్రచారం చేసుకుంటోంది. చైనాలో కోవిడ్-19 వాస్తవ గణాంకాలు బయటపడేకొద్దీ.. చైనా పట్ల ప్రపంచం ఆగ్రహం కూడా పెరుగుతుంది" అని సోఫియా అన్నారు.

 
కరోనావైరస్ నుంచి బయటపడ్డానికి చైనా అనుసరించిన విధివిధానాలపై కూడా బ్రెజిల్ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి బ్రెజిల్, చైనా మధ్య చాలాసార్లు ఉద్రిక్తతలు బయటపడ్డాయి. ఒకసారి ఇది, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో సన్నిహిత అధికారి, చైనా దౌత్య అధికారి సోషల్ మీడియాలో బహిరంగంగా పరస్పర ఆరోపణలకు దిగేవరకూ వెళ్లింది.

 
చైనాను, బ్రెజిల్‌కు అతిపెద్ద పారిశ్రామిక భాగస్వామిగా భావిస్తారు. అంటే, బ్రెజిల్ పండించే 80 శాతం సోయాబీన్ చైనానే కొంటుంది. కానీ బ్రెజిల్ అధికారులు మాత్రం చైనా నుంచి వెంటిలేటర్లు, మిగతా వైద్య పరికరాలు కొనుగోలు చేయాడానికి నానా తంటాలూ పడుతున్నారు. “ఈ ఉదాహరణలన్నీ చూస్తుంటే.. ప్రపంచానికి దౌత్య సహకారం ఇంతకు ముందు కంటే, ఇప్పుడు చాలా అవసరం అని స్పష్టం అవుతోంది. అన్ని దేశాలు పరస్పరం చర్చించుకుని, ఒకరిపై ఒకరికి ఉన్న భయాలను దూరం చేయాలి” అని బాయెజ్ భావిస్తున్నారు.

 
కానీ లాటిన్ అమెరికాలోని రెండు పొరుగు దేశాలు కొలంబియా, వెనెజ్వేలా మధ్య వైరస్ వ్యాప్తికి ముందే గొడవలు ఉన్నాయి. వెనెజ్వేలా అధ్యక్షుడు నికొలస్ మదూరో ప్రభుత్వానికి కొలంబియా ప్రభుత్వం గుర్తింపు ఇవ్వదు. వెనెజ్వేలా నుంచి భారీగా కొలంబియాకు వలస వెళ్లడంపై కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

 
ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఉదాహరణగా ఇటీవల ఏప్రిల్‌లో జరిగిన ఒక ఘటనను చెప్పవచ్చు. వెనెజ్వేలా అధ్యక్షుడు నికొలస్ మదూరో, కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డుక్యుకు రెండు కోవిడ్-19 టెస్టింగ్ మెషిన్లు ఇస్తామని ప్రతిపాదించారు. కానీ ఆలోపే కొలంబియాలో టెస్ట్ చేసే ఏకైక మెషిన్ పాడైందని మీడియాలో వార్తలు వచ్చాయి.

 
అయినా, వెనెజ్వేలా ప్రతిపాదనకు కొలంబియా అధ్యక్షుడు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో వెనెజ్వేలా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్‌రిగ్జ్ చాలా ఆగ్రహించారు. “రెండు కరోనా టెస్టింగ్ మెషిన్లు ఇస్తామన్న మా అధ్యక్షుడు మదూరో ప్రతిపాదనను డెల్సీ ఇవాన్ డుక్యు ప్రభుత్వం తిరస్కరించింది. కొలంబియా ప్రజలు, వారి ఆరోగ్యం పట్ల ఆ దేశాధ్యక్షుడికి ఎలాంటి చిత్తశుద్ధీ లేదని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు.

 
కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డుక్యు ఏప్రిల్ 7న ఒక రేడియో చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “వెనెజ్వేలా మాకు ఇస్తామని చెప్పిన మెషిన్లకు.. మా దగ్గర లభించే కెమికల్, మిగతా వనరులకు సరిపోవు” అని చెప్పారు. ఇక పశ్చిమాసియా విషయానికి వస్తే ఖతార్, ఈజిఫ్ట్ మధ్య ఇలాంటి గొడవే ఉంది. ఖతార్‌లో చిక్కుకుపోయిన ఈజిఫ్టు పౌరుల భవిష్యత్ గురించి ఉద్రిక్తతలు పెరిగుతున్నాయి.

 
ఖతార్‌లో ప్రస్తుతం పశ్చిమాసియాలో మిగతా దేశాల్లో ఎక్కడా లేనన్ని కరోనా కేసులు ఉన్నాయి. ఖతార్ అధికారులు అల్ జజీరా చానల్‌తో “మా దేశంలో చిక్కుకుపోయిన ఈజిఫ్టు పౌరులను ఒక ప్రత్యేక విమానంలో తిరిగి వారి దేశానికి పంపిస్తామనే ప్రతిపాదనను అక్కడి ప్రభుత్వం తిరస్కరించింది” అని చెప్పారు. 2017 తర్వాత ఖతార్‌తో అన్నిరకాల దౌత్య సంబంధాలు తెంచుకున్న అరబ్ దేశాల్లో ఈజిఫ్ట్ కూడా ఒకటి. ఖతార్ తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందని ఈ దేశాలు ఆరోపిస్తున్నాయి.

 
ఈ ఉద్రిక్తతలకు వేరే కారణాలు ఉన్నాయి
మాస్క్, లాక్‌డౌన్ గురించే కాదు.. ప్రపచంలో చాలా దేశాల మధ్య మరో రకం ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. “రష్యా ప్రభావం ఉన్న కొన్ని మీడియా సంస్థలు, కోవిడ్-19 వైరస్‌తో పశ్చిమ దేశాల ఇమేజ్ నాశనం చేయడానికి ప్రచారం చేస్తున్నాయి” అని మార్చి 18న యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఒక రిపోర్ట్ మీడియాలో లీక్ అయ్యింది.

 
రష్యా ప్రభుత్వ ప్రతినిధులు వాటిని నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుంటే, ఈ మహమ్మారి వల్ల కొన్ని దేశాల మధ్య పరస్పర సహకారం కూడా పెరిగిందనే నివేదికలు కూడా వస్తున్నాయి. “ఈ మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభంతో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారానికి సంబంధించి కొత్త అవకాశాలు కూడా వెలుగులోకి వచ్చాయి” అని ఓవర్‌సీస్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చర్ అనాలియా ప్రిజాన్ అన్నారు.

 
“ఎప్పుడూ అభివృద్ధి చెందిన దేశాలు చెప్పిందే కరెక్ట్ కాదని, అవి అన్ని అంశాల్లో నిపుణులు కాలేవని ఈ సంక్షోభం నిరూపించింది” అని ఆమె చెప్పారు. ఈ మహమ్మారిని అడ్డుకున్న చైనా తన అనుభవాన్ని ఇటలీకి సాయం చేయడానికి ఉపయోగించడం దీనికి ఒక మంచి ఉదాహరణ అన్నారు. కానీ, ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య సహకారం అవసరం అని సోఫియా గేస్టన్ ఇప్పటికీ భావిస్తున్నారు.

 
“ఇప్పటివరకూ అన్ని దేశాలు సహకారం అందించేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో జాతీయవాదం, ప్రజాస్వామ్య ఉద్యమాల ఒత్తిడిలో అలా జరిగింది. ఇది సహకార శక్తిలో ఉన్న బలమేంటో చూపించాల్సిన సమయం. కానీ, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న చాలా దేశాలు తమ సంబంధాలను మరింత నాశనం చేసేలా విధానాలు రూపొందిస్తున్నాయి” అన్నారు.