మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:31 IST)

కరోనావైరస్: ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి? ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి ఏం చెబుతున్నారు?

భారత ఆర్థికవ్యవస్థ 5 నుంచి 6 శాతం వృద్ధి రేటు అందుకోవాలంటే మూడు నుంచి ఐదేళ్లు పట్టొచ్చని భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు అంటున్నారు. అది కూడా సరైన విధానాలు పాటిస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం భారత ఆర్థికవ్యవస్థ గాడినపడేందుకు ఉన్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాల గురించి బీబీసీతో ఆయన మాట్లాడారు.

 
తక్షణ సవాళ్లు
జనాలు ఉపాధి కోల్పోకుండా చూడటం, వృద్ధి రేటును తిరిగి పుంజుకునేలా చేయడం ఇప్పుడు దేశం ముందు ఉన్న అతిపెద్ద సవాలు అని సుబ్బారావు అన్నారు. ‘‘కరోనావైరస్ సంక్షోభం ఇంకా తీవ్రమవుతోంది. ఇది ఎప్పుడు, ఎలా అదుపులోకి వస్తుందో తెలియడం లేదు. ఈ సమయంలో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తాత్కాలిక ఉపశమనానికి జీవనాడిగా ఉంది. కానీ, ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదు’’ అని ఆయన అన్నారు. కరోనావైరస్ సంక్షోభం కన్నా ముందే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్న విషయాన్ని సుబ్బారావు గుర్తుచేశారు.

 
కరోనా రాకముందు దేశ వృద్ధి రేటు గత దశాబ్దంలోనే అత్యల్పంగా, 4.1%గా ఉంది. ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య వ్యత్యాసం) అధికంగా ఉంది. ఫైనాన్స్ రంగం మొండి రుణాల సమస్యతో సతమతమవుతూ ఉంది.

 
కరోనావైరస్ సంక్షోభం దాటేసరికి, ఇదివరకటి సమస్యలు మరింత పెద్దవవుతాయని... వీటిని మనం ఎలా అధిగమిస్తామనే విషయంపై మనం పుంజుకునే అవకాశాలు ఆధారపడి ఉంటాయని సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

 
భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు పుంజుకోగలదని భావిస్తున్నారన్న ప్రశ్నకు... ‘‘వృద్ధి రేటు ధనాత్మక పథంలోకి (పాజిటివ్) వచ్చే ఏడాదికల్లా రావొచ్చు. కానీ, ఈ ఏడాది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఏం చెప్పలేం’’ అని అన్నారు.

 
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా 23.9 శాతం కుంచించుకుపోయింది. ఈ ఏడాది మొత్తంగా కూడా రెండంకెల రుణాత్మక (నెగిటివ్) వృద్ధి రేటు నమోదు కావొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

 
పరిష్కారాలు
కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయని, వాటిని ఆధారంగా చేసుకుని భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ‘‘ఉదాహరణకు పట్టణ ఆర్థిక వ్యవస్థతో పోల్చితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకుంది. గ్రామీణ ఉపాధి హామీ దానికి జీవనాడిగా నిలిచింది. నేరుగా ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడం ద్వారా మహిళలు, పింఛనుదారులు, రైతుల చేతుల్లోకి డబ్బు చేరింది. డిమాండ్‌కు తిరిగి జీవం పోయడానికి ఇది సాయపడింది’’ అని ఆయన అన్నారు.

 
‘‘వ్యవసాయ రంగంలో ఇటీవల తీసుకువచ్చిన సంస్కరణలు కూడా సానుకూలాంశం. భారత్‌ చాలా పెద్ద మార్కెట్. ఉత్పత్తి ఊపందుకోవడానికి 135 కోట్ల జనాభా ఎంతో దోహదపడుతుంది’’ అని సుబ్బారావు అన్నారు. ప్రజల చేతుల్లోకి డబ్బు చేరితే, సహజంగానే వినియోగం కూడా పెరుగుతుందని సుబ్బారావు అంటున్నారు. కానీ ఇందుకోసం సాహసోపేత విధానాలను తెచ్చి, అమలు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

 
ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, నికర ఎగుమతులు కుంచించుకుపోయిన పరిస్థితుల్లో ప్రస్తుత సవాళ్లను అధిగమించాలంటే ప్రభుత్వం వ్యయం పెంచాలన్న వాదనతో సుబ్బారావు ఏకీభవించారు. ‘‘క్షీణతను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వ్యయం పెంచకపోతే... మొండి రుణాలు, అలాంటి అనేక సమస్యలను పరిష్కరించడం తలకు మించిన పని అవుతుంది. పోనుపోనూ ఆర్థికవ్యవస్థపై పెను భారం పడే ప్రమాదం ఉంది’’ అని ఆయన అన్నారు.

 
అయితే, ప్రభుత్వం రుణాలు తీసుకునే విషయంలోనూ పరిమితులు విధించుకోవడం అవసరమని చెప్పారు. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన ప్రధాన అంశాలు నాలుగు ఉన్నాయని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఆ అంశాలు...

 
* గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం ద్వారా ప్రజల జీవనోపాధికి రక్షణ కల్పించాలి.
* సమస్యలు ఎదుర్కొంటున్న ఉత్పత్తి కేంద్రాలకు సహకారం అందించడం ద్వారా నిరుద్యోగ సమస్యను, మొండి రుణాల సమస్యను కట్టడి చేయాలి.
* మౌలిక వసతులతోపాటు ఉద్యోగాలను సృష్టించే ప్రాజెక్టులపై ప్రభుత్వం వ్యయం చేయాలి.
* నగదు ప్రవాహాన్ని పెంచేందుకు బ్యాంకులకు మళ్లీ పెట్టుబడులు అందించేందుకు ప్రభుత్వం ఖర్చు చేయాలి.
* అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఉద్యోగాలు సృష్టించడం. కరోనా సంక్షోభం రాకముందు కూడా ఇదే దేశానికి పెద్ద సవాలుగా ఉంది.

 
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే పరిశోధన సంస్థ గత ఆగస్టులో భారత్‌లో నిరుద్యోగం రేటు 9.1 శాతంగా ఉందని అంచనా వేసింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రతి నెలా పది లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించాలి. కానీ, అందులో సగం కూడా ఏర్పడటం లేదు. ఉద్యోగాల వేటలో ఉన్న యువత జీవితాల్లో మార్పు తెస్తానన్న హామీ ఇచ్చి 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. కానీ, ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేకపోయారు.

 
ఇక కరోనావైరస్ సంక్షోభం నిరుద్యోగ సమస్యను మరిన్ని రెట్లు పెద్దది చేసింది. ‘‘ఉద్యోగాల సృష్టి కోసం భారత్ తయారీ రంగంపై దృష్టి పెట్టాలి. అందుకే ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ఇండియా’, ‘మేక్ ఫర్ ద వర్ల్డ్’... ఇవన్నీ ముఖ్యమైన లక్ష్యాలు’’ అని సుబ్బారావు అన్నారు.