శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 2 డిశెంబరు 2019 (16:36 IST)

పార్లమెంటులో ‘దిశ’ చర్చ: ‘శిక్ష వెంటనే అమలు చేయకపోతే ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులు ఎందుకు’

షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై సోమవారం పార్లమెంటులోని రెండు సభల్లోనూ చర్చ జరిగింది. లోక్‌సభలో ఈ అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ ఓం బిర్లా జీరో అవర్‌లో సభ్యులకు అవకాశం ఇచ్చారు. తెలంగాణలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతుండటం ఈ ఘటన జరగడానికి ఓ కారణమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బాధితురాలి తల్లిదండ్రుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరునూ ఆయన తప్పుపట్టారు.

 
''కుటుంబ సభ్యులకు కాకుండా పోలీసులకు ఫోన్ చేసి ఉంటే బాధితురాలు ప్రాణాలతో ఉండేదని తెలంగాణ హోంమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితురాలి కుటుంబ సభ్యులను.. పోలీసులు స్టేషన్ల చుట్టూ తిప్పారు. 'మీ కూతురు ఎవరితోనో పారిపోయి ఉండొచ్చు' అంటూ అవమానించారు. మొదటి పోలీస్ స్టేషన్‌లోనే కేసు నమోదు చేసుకుని, బాధితురాలి కోసం గాలింపు చేపట్టి ఉంటే ఆమె ప్రాణాలను కచ్చితంగా కాపాడేవాళ్లం’’ అని ఉత్తమ్ అన్నారు.

 
‘‘ఓ ప్రభుత్వ వైద్యురాలికి ఇలా జరగడం పట్ల మనందరం తలదించుకోవాలి. ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు త్వరగా తీర్పునిచ్చి, దోషులకు ఉరిశిక్ష విధించాలి'' అని ఆయన అన్నారు. మహిళల రక్షణ కోసం సంస్కరణలు, సదుపాయాలు తెస్తున్నామని చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

 
''నిందితులకు వెంటనే శిక్షలు అమలుచేస్తే తప్ప, ఈ తరహా నేరాలు ఆగవు. ఘటనలు జరిగినప్పుడు, ఖండిస్తున్నాం. వాటి గురించి మాట్లాడుతున్నాం. కానీ, అలాంటివి జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలనేదానిపై చర్చించడం లేదు. చట్టాల్లో మార్పులు వస్తే గానీ, పరిస్థితి మారదు'' అని ఆయన అన్నారు. సామూహిక అత్యాచారాలను అరికట్టేందుకు దోషులకు మరణ శిక్ష విధించే విధంగా చట్టాన్ని తేవాలని సభలోని సభ్యులంతా ముక్త కంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారని బీజేడీ (ఒడిశా) ఎంపీ పినాకీ మిశ్ర వ్యాఖ్యానించారు.

 
నిర్భయ కేసులో దోషులకు సుప్రీం కోర్టు ఉరి శిక్షలు విధించి మూడేళ్లవుతున్నా, తిహార్ జైల్లో వాళ్లు అలాగే ఉన్నారని అన్నారు. శిక్షలు సత్వరం అమలు చేయనప్పుడు, ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులు పెట్టి లాభం లేదని అన్నారు. మహిళలపై జరిగే ఇలాంటి నేరాలను అస్సలు ఉపేక్షించకూడదని, ఈ విషయంలో ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు.

 
‘‘నిర్భయ కేసులో విధించిన తీర్పులను ఇప్పటికీ అమలు చేయలేకపోతున్నాం. పరస్పరం పార్టీలపై విమర్శలు చేసుకుంటున్నాం గానీ, చేయాల్సిన చట్టాల గురించి మాట్లాడటం లేదు’’ అని టీఆర్ఎస్ ఎంపీ ఎం.కవిత అన్నారు. ‘‘మమ్మల్ని పూజించనక్కర్లేదు, గౌరవించనక్కర్లేదు. మమ్మల్ని మాలా బతకనివ్వండి చాలు. మహిళలను బయటకు పంపే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలే మేల్కొనాలి. మద్యం, డ్రగ్స్‌ ఇలాంటి నేరాలకు కారణం. వాటిని అరికట్టాలి’’ అని వైఎస్సార్పీపీ ఎంపీ వంగా గీతా వ్యాఖ్యానించారు.

 
‘‘ఘటనకు ముందు బాధితురాలు తన సోదరికి ఫోన్ చేసింది. ‘నాకు భయమేస్తోంది’ అని చెప్పింది. అది ఆమె ఒక్కరి భావన కాదు. ఈ దేశంలోని ప్రతి మహిళా అదే భావనతో ఉన్నారు. ఇలాంటి హేయమైన నేరాలకు మరణ శిక్షే విధించేలా చట్టం చేయాలి. అబ్బాయిలకు, పురుషులకు కూడా అవగాహన కల్పించాలి. బాల్యం నుంచే విద్యలో దాన్ని భాగం చేయాలి. ‘వద్దు’కు అర్థం ‘వద్దే’నని బోధించాలి’’ అని టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు అన్నారు.

 
‘‘పోలీస్ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగింది. తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకువెళ్లి, అత్యాచారానికి పాల్పడిన దోషికి కోర్టు మరణశిక్ష విధించినా, అమలు కాలేదు. ఇలా ఎందుకు ఆగాల్సి వస్తోంది’’ అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా స్పందించారు.

 
‘‘హైదరాబాద్‌లో మనం చూసిన ఘటన కన్నా అమానవీయమైన చర్య మరొకటి ఉండదు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత కఠినమైన చట్టం వచ్చినప్పుడు ఇలాంటివి తగ్గుతాయని అనుకున్నాం. కానీ, అలా జరగలేదు. సభలో ఈ అంశంపై చర్చ జరుపుదామంటే మాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఇలాంటి ఘటనల బాధ్యులను అత్యంత కఠినంగా శిక్షించేందుకు ఎలాంటి చట్టాలు తీసుకువద్దామన్నా, ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉంది’’ అని అన్నారు.

 
రాజ్యసభలోనూ ‘మహిళల భద్రత అంశంపై చర్చ జరిగింది. ‘‘హైదరాబాద్‌లో జరిగిన ఆ ఘటన మానవ విలువలకు మచ్చ. ఇది హైదరాబాద్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదు. దేశమంతటా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మన సమాజంలో మహిళలకు ఉన్నత స్థానం ఉంది. ‘అసలు ఎందుకు ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి? వాటిని ఎలా నివారించాలి?’ అనే అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం, మనమంతా కలిసి దీనికి సమాధానం ఇవ్వాలి. చట్టాలు చేయడంతోనే పరిస్థితి మారదు’’ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు.

 
‘శిక్ష విధించిన తర్వాత కూడా ఏమవుతుందో మనం చూస్తున్నాం. అప్పీళ్లు, క్షమాభిక్ష.. ఇలాంటి వాళ్లకు మనం క్షమాభిక్ష పెట్టగలమా? ఆ ప్రక్రియలు ఇంకా ఎందుకు ఉండాలి? న్యాయవ్యవస్థలో మనం మార్పు తేవాలి. హైదరబాద్‌లో జరిగిందన్న కారణంతో మనం ఈ విషయం గురించి చర్చించట్లేదు. ఈ ఘటనను కేవలం ఓ నగరానికో, రాష్ట్రానికో ఆపాదిస్తే తప్పు. దేశమంతా ఇవి జరుగుతున్నాయి. ఇదొక సామాజిక రుగ్మత. మన విధానాల్లో లోపాలున్నాయి. అకృత్యాలు చేసేవాడు, బాల నేరస్తుడు ఎలా అవుతాడు. ఈ అంశాన్ని కూడా మనం సమీక్షించాలి. దీనికి బిల్లు కాదు, రాజకీయ సంకల్పం కావాలి’’ అని వ్యాఖ్యానించారు.

 
‘‘ఏ ప్రాంతానిదో, పార్టీదో తప్పు కాదు. ఏ పార్టీ ప్రభుత్వమైనా, నాయకులైనా ఇలాంటి దుర్ఘటనలు జరగాలని కోరుకోరు. ఇప్పటివరకూ మనం ఎన్నో కఠినమైన చట్టాలను చేశాం. కానీ, వాటితోనే పరిస్థితి మారిపోదన్న విషయం చూస్తూనే ఉన్నాం. ఈ రోగాన్ని కూకటి వేళ్లతో సహా తొలగించేందుకు మొత్తం సమాజం ముందుకురావాలి. మొత్తం దేశం ముందుకురావాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. మతం, పార్టీ అంటూ పక్షపాతం చూపించకూడదు’’ అని కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.

 
‘‘ఇలాంటి ఘటనలపై ఎన్ని సార్లు మాట్లాడానో నాకే తెలియదు. నిర్భయ, కథువా, ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన విషయమైనా.. ప్రజలు ప్రభుత్వం నుంచి ఇప్పుడు కచ్చితమైన సమాధానాన్ని కోరుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఆ ఘటన జరిగిన ప్రాంతంలో రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమయ్యోరో చెప్పాల్సిన బాధ్యత అక్కడి అధికారులపై లేదా? విధులు విస్మరించినవారిని తలదించుకునేలా చేయాలి. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే తగిన శిక్ష విధిస్తారు. నేను కాస్త కఠినంగా మాట్లాడుతున్నానని తెలుసు. కానీ, అలాంటివారిని బహిరంగంగా కొట్టి చంపాలి’’ అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్ఛన్ అన్నారు.

 
(గమనిక: షాద్‌నగర్ అత్యాచారం కేసులో బీబీసీ తెలుగు నిబంధనలకు లోబడి ఇప్పటివరకూ బాధితురాలి పేరు ప్రస్తావించలేదు. పోలీసులు బాధితురాలిని ‘దిశ’ అని వ్యవహరించాలని సూచించినందున, ఇకపై వార్తల్లో బాధితురాలి పేరును ‘దిశ’గానే పేర్కొంటాం)