శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2019 (13:58 IST)

ధనత్రయోదశి: బంగారం కొనుగోళ్లకు ఇది సరైన సమయమేనా

భారతీయులకు బంగారం అంటే ఆసక్తి ఎక్కువ. బంగారం ధరించడం గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. ఈ సామాజిక కోణంతో పాటు... సంప్రదాయ, ఆచార, ఆర్థిక అంశాలు, నమ్మకాలు కూడా బంగారం చూట్టూ ముడిపడి ఉన్నాయి. పండగలు, శుభకార్యాలకు బంగారం కొనడం భారతీయులకు అలవాటుగా వస్తోంది. ధనత్రయోదశి నాడు బంగారం కొనడం అనే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది.

 
ధనత్రయోదశి వంటి రోజుల్లో బంగారం కొనుగోలు చేసి, ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కొందరు విశ్వసిస్తారు. ఆ విశ్వాసం బంగారం అమ్మకాలపైనా ప్రభావం చూపిస్తుంది.

 
గతేడాది 40 టన్నుల బంగారం అమ్మకాలు
భారత దేశంలో బంగారానికి డిమాండ్ పెరిగే సందర్భాలు మూడు ఉన్నాయి. అవి పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్, పండుగల్లో డిమాండ్, సాధారణ డిమాండ్. సాధారణంగా ధనత్రయోదశి, దీపావళి పండుగ ముందు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. గతేడాది ధనత్రయోదశి నాటికి బంగారం ధరలు తక్కువగా ఉన్నాయి, కాబట్టి దేశవ్యాప్తంగా ధన త్రయోదశి అమ్మకాలు బాగానే జరిగాయి.

 
2018 నవంబర్ 5న గతేడాది ధనత్రయోదశి నాటికి భారతదేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ.31,800 వేల వరకూ ఉంది. కానీ అంతకు నెల రోజుల ముందు అక్టోబర్లో పది గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ ధర 32,400 రూపాయల వరకూ పలికింది.

 
అంటే ధన త్రయోదశి నాటికి బంగారం ధర తగ్గిందన్నమాట. ఈ తగ్గుదల ఆనాటి ధనత్రయోదశి అమ్మకాలకు అనుకూలంగా మారింది. ధన త్రయోదశి ముందు బంగారం ధర భారీగా తగ్గడంతో అమ్మకాలు కూడా బాగానే జరిగాయి.

 
ఈ ఏడాది 30 శాతం పెరిగిన బంగారం ధర
ఈ ఏడాది ధనత్రయోదశి నాడు బంగారం కొనుగోళ్లు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని పరిశ్రమల వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ధనత్రయోదశి వంటి రోజుల్లో బంగారం అమ్మకాలు 40 టన్నుల వరకూ ఉండేవని, కానీ ఈ ఏడాది మాత్రం ఆ స్థాయిలో కొనుగోళ్లు ఉండే అవకాశం లేదని ఇండియన్ బులియన్ అండ్ జుయెలర్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహతా బీబీసీకి చెప్పారు.

 
దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే.. ఈ ఏడాది ధనత్రయోదశికి గతేడాదితో పోలిస్తే బంగారం కొనుగోళ్లు 25 శాతం వరకూ తగ్గే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితికి మొదటి కారణం బంగారం ధర 30 శాతం పెరగడమే అని బిజినెస్ అనలిస్ట్ సతీశ్ మండవ బీబీసీతో అన్నారు.

 
గతేడాది ధనత్రయోదశి నాటికి 31,800 రూపాయలున్న 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ ధర ఇప్పుడు భారీగా పెరిగింది. 25 అక్టోబర్ 2019 నాటికి పది గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర దిల్లీలో 38,440 రూపాయలు కాగా ముంబైలో 37,800 రూపాయలు. ప్రస్తుతం ఉన్న కమోడిటీ అనలిస్ట్‌ల అంచనా ప్రకారం.. బంగారం ధర తగ్గే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి.

 
పైగా గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధర ఏడు వేల రూపాయల మేర పెరిగింది. ఒక్క ఏడాదిలో బంగారం ధర ఇలా పెరగడం ఎప్పుడూ లేదు. ఇంతలా పెరిగిన బంగారం ధర ఈ ధనత్రయోదశి అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

 
తగ్గిన బంగారం దిగుమతి
ఈ ఏడాది ఇతర పండుగలు, పర్వదినాల్లో కూడా బంగారం కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. గతేడాది దసరా నాడు అమ్మకాలతో పోలిస్తే... ఈ ఏడాది దసరా నాడు అమ్మకాలు 20 శాతం మేర తగ్గాయి. వాటితో పాటు బంగారం దిగుమతులు కూడా... 12 శాతం తగ్గాయి.

 
అంతర్జాతీయ పరిణామాలు, తాజా బడ్జెట్‌లో బంగారంపై 10 శాతంగా ఉన్న ఇంపోర్ట్ ట్యాక్స్‌ను 12.5 శాతానికి పెంచడం.. ఈ కారణాలన్నీ 2019లో బంగారం దిగుమతులు 12 శాతం తగ్గడానికి కారణమయ్యాయి. 2019 సెప్టెంబర్ వరకూ ఈ ఏడాదిలో 565 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయ్యింది.

 
కానీ, 2018 సెప్టెంబర్ నాటికి దేశంలో దిగుమతి అయిన బంగారం 644 టన్నుల వరకూ ఉంది. ఇక గతేడాది ఒక్క సెప్టెంబర్ నెలలో 81.71 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటే.. ఈ ఏడాది సెప్టెంబర్లో కేవలం 26 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయ్యింది. అంటే ఒక్క సెప్టెంబర్లోనే గతేడాది కన్నా 68.18 శాతం దిగుమతి తగ్గిపోయింది.

 
ఆర్థిక మాంద్యం ప్రభావం
ఈ ఏడాది బంగారం కొనుగోళ్లపై ధరల తర్వాత ఆర్థిక మాంద్యం కూడా ప్రతికూల ప్రభావం కనబర్చే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో ప్రజలు కొనుగోళ్ల మీద వెచ్చిందే మొత్తాన్ని తగ్గించారు.

 
వాస్తవానికి రూపాయి విలువ తగ్గినప్పుడు, మాంద్యం వంటి పరిస్థితుల్లో ప్రజలు పెద్ద ఎత్తున బంగారంపై మదుపు చేయాలని చూస్తారు. ఈ పరిస్థితి బంగారం ధర పెరగడానికి పరోక్షంగా కారణమవుతుంది. కానీ ఇప్పుడు దేశంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మాంద్యం పరిస్థితులకు తోడు, ప్రజల దగ్గర నగదు లభ్యత కూడా తక్కువగా ఉంది. దీంతో ప్రజలు బంగారం కొనుగోళ్ల మీద ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగానే ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

 
ఆఫర్లు ఆకట్టుకుంటే కొనుగోళ్లు పెరిగే అవకాశం
ఈ ధనత్రయోదశి, దీపావళికి బంగారం కొనుగోళ్లు తగ్గే అవకాశముందని బిజినెస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బంగారం వ్యాపారులు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తే కొనుగోళ్లు పుంజుకునే అవకాశముందంటున్నారు.