బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 21 డిశెంబరు 2020 (15:15 IST)

2020ని తిట్టుకోవద్దు.. అంతకు మించిన దారుణమైన సంవత్సరాలు ఇవి..

మనలో చాలామందికి 2020 ఒక చీకటి సంవత్సరం, ఎడతెగని ఏడాది, వీడియో కాల్స్ కాలం.. మరికొందరైతే మహమ్మారి పీడించిన ఈ సంవత్సరాన్ని ‘మునుపెన్నడూ చూడనంత చెత్త సంవత్సరం’గా అభివర్ణిస్తున్నారు. అయితే, ఒక్కసారి చరిత్రలోకి కనుక వెళ్లినట్లయితే పరిస్థితులు అధ్వానంగా మారాయే కానీ చెడ్డగా మారిపోలేదని తెలుస్తుంది. కోవిడ్-19 మనకు చేసిన నష్టాన్ని ఒక్కసారి చూడండి.. అంతకుముందు చరిత్రలో ఇలాంటి గడ్డు పరిస్థితులతో పోల్చుకోండి.

 
మశూచి, స్పానిష్ ఫ్లూ, ఎయిడ్స్‌
2020లో కోవిడ్ ఎందరినో బలి తీసుకుంది. డిసెంబరు 17 వరకు ఉన్న గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.45 కోట్ల మంది కరోనావైరస్ సోకింది. 16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచాన్ని వణికించిన అత్యంత భయానక మహమ్మారులతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే. బ్యుబోనిక్ ప్లేగు కారణంగా 1346వ సంవత్సరం నుంచి ఒక్క యూరప్‌లోనే 2.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.

 
ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి 20 కోట్ల మంది ప్రాణాలు హరించింది. స్పెయిన్, పోర్చుగీస్ వలసల కారణంగా అమెరికాలో ప్రబలిన మశూచి కారణంగా అక్కడి స్థానిక ప్రజల్లో 60 నుంచి 90 శాతం మంది చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1918లో సైనికులు తమతమ దేశాలకు చేరుకుంటున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన స్పానిష్ ఫ్లూ కారణంగా 5 కోట్ల మంది మరణించారు. అది అప్పటి ప్రపంచ జనాభాలో సుమారు 3 శాతం.1980 నుంచి ఎయిడ్స్ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3.2 కోట్ల మందికిపైగా ప్రజలు మరణించారు.

 
జీవనోపాధి పోయింది
2020లో ఉద్యోగాలు పోయాయికరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితుల వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో తమ జీవనోపాధిని కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ 1929-1933 మధ్య కాలంలో ఏర్పడినంత నిరుద్యోగిత రేటు ఇప్పుడు లేదు. 1933 ఎంత గడ్డు సంవత్సరమంటే.. జర్మనీలో ఆ ఏడాది ప్రతి ముగ్గురిలో ఒకరు పని లేకుండా పస్తులుండాల్సి వచ్చింది. అప్పుడే అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి వచ్చారు.

 
18 నెలలు అంధకారంలోనే
స్నేహితులను కలుసుకోలేని సంవత్సరంప్రపంచంలోని అత్యధిక ప్రాంతాల్లో ప్రజలు తమ ప్రియతములను, స్నేహితులను కలుసుకోకుండా ఇంటికే పరిమితమైన సంవత్సరమిది. అయితే, క్రీ.శ. 536లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల ప్రజలు కనీసం ఆకాశం కూడా చూడలేకపోయారు. ఆ ఏడాది యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియాలోని కొన్ని ప్రాంతాలను అంతుచిక్కని రీతిలో పొగమంచు ముంచెత్తడంతో 18 నెలల పాటు ప్రజలు రాత్రీపగలు అంధకారంలోనే ఉన్నారని హార్వర్డ్ మెడిఈవల్ హిస్టోరియన్, ఆర్కియాలజిస్ట్ మైఖేల్ మెక్ కార్మిక్ చెప్పారు.

 
ఆ కాలంలో పంటలు పండలేదు.. ప్రజలు ఆకలితో అలమటించారు. ఆ దశాబ్దమంతా విపరీతమైన శీతల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐస్‌లాండ్‌లో కానీ ఉత్తర అమెరికాలో కానీ అగ్నిపర్వత విస్ఫోటం వల్ల ఉత్తరార్థ గోళమంతటా బూడిద ధూళి వ్యాపించి ఇలాంటి విపత్తు కలిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 
విహార యాత్రా లేదు.. విదేశీ యానం లేదు
ప్రపంచ పర్యటక రంగానికి ఈ సంవత్సరం అత్యంత గడ్డు కాలం. అయితే, చరిత్రలోకి చూసినట్లయితే.. 1,95,000 సంవత్సరాల కిందట హోమోసేపియన్లు తీవ్రమైన ప్రయాణ పరిమితులను చవిచూశారు. మైరైన్ ఐసోటోప్ 6వ దశగా పిలిచే అతి శీతల, పొడి వాతావరణం అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల పాటు ఉంది. అప్పుడు ఏర్పడిన దారుణ దుర్భిక్ష పరిస్థితులు మన జాతులను దాదాపు తుడిచిపెట్టేశాయని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఆరిజన్‌కు చెందిన ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ కర్టిస్ మరీన్ వంటి శాస్త్రవేత్తలు చెబుతారు. ఆఫ్రికా దక్షిణ తీరంలోని ఒక సన్నని భూభాగంపై తల దాచుకుని మానవ జాతి బతికి బయటపడిందని.. అక్కడే మానవ జాతి సముద్ర ఆహారంపై ఆధారపడి బతకడాన్ని నేర్చుకుందని ప్రొఫెసర్ కర్టిస్ చెప్పారు.

 
పోలీసుల కాఠిన్యం
2020లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పోలీసుల కాఠిన్యం పతాక శీర్షికలకెక్కింది. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో మరణించిన తరువాత ఉద్యమం, నైజీరియాలో అకృత్యాలకు పాల్పడుతున్న ‘స్పెషల్ యాంటీ రాబరీ స్క్వాడ్’కు ముగింపు పలకాలన్న ఉద్యమం, కొలంబియా, ఫ్రాన్స్, హాంకాంగ్ వంటి చోట్లా పోలీసు హింస చర్చనీయాంశంగా మారింది.

 
అయితే, ఇలాంటిది ఇదే తొలిసారి కాదు. 1992 ఏప్రిల్‌లో నల్లజాతికి చెందిన రోడ్నీ కింగ్‌ను నలుగురు శ్వేత జాతి పోలీసులు కొట్టిన వీడియోలు బయటకు రావడంతో లాస్ ఏంజెలిస్‌లో ఘర్షణలు జరిగాయి. కొన్ని రోజుల పాటు హింస కొనసాగింది. లూటీలు, దహనాలు జరిగాయి. 54 మంది చనిపోయారు. లాస్ ఏంజెలిస్‌లో 100 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగింది.

 
బేరూత్ పేలుడు
లెబనాన్ రాజధాని బేరూత్‌లో 2020 ఆగస్టు 4న ప్రమాదవశాత్తు 2,750 టన్నుల అమ్మోనియమ్ నైట్రేట్ పేలుడుతో 190 మంది మరణించారు. ప్రపంచ చరిత్రలో అణు విస్ఫోటాలు కాని భారీ పేలుళ్లలో ఇది కూడా ఒకటి. 1984 డిసెంబరులో భారత్‌లోని భోపాల్ నగరంలోని ఒక పరిశ్రమ నుంచి రసాయనాలు లీకై వేలాది మంది మరణించారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత తీవ్రమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఇదొకటి.విషవాయువులు లీకైన కొద్దిరోజుల్లోనే 3500 మంది మరణించారని.. ఆ తరువాత ఏడాది కాలంలో ఆ ప్రభావంతో 15 వేల మంది మరణించారని భారత ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

 
కార్చిచ్చులతో వందల కోట్ల ప్రాణులకు ముప్పు
ఆస్ట్రేలియాలో 2020లో కార్చిచ్చుల వల్ల సుమారు 300 కోట్ల ప్రాణులు మరణించడమో, నిరాశ్రయమవడమో జరిగింది. ఈ కార్చిచ్చులకు 33 మంది బలయ్యారు. అయితే, చరిత్రలోకి చూస్తే అగ్నికీలలు ఇంతకంటే ఎక్కువ మంది ప్రాణాలు హరించిన సందర్భం మరొకటి ఉంది. 1923 సెప్టెంబరులో భూకంపాల వల్ల జపాన్‌లో ఫైర్‌స్టార్మ్స్, ఫైర్ టోర్నడో ఏర్పడి టోక్యో, యొకహామా మధ్య 1,40,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

 
కష్టాల సంవత్సరంలో సంతోషం
2020 సంవత్సరం అనేక రకాలుగా కష్టకాలం అనిపించినా ప్రపంచం ఈ ఏడాది కొన్ని సానుకూల పరిణామాలూ చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. దేశాధినేతగా మహిళలు ఉన్న దేశాల సంఖ్య ఈ ఏడాది 20కి చేరింది. 1995లో ఈ సంఖ్య 12గా ఉండేది. ప్రపంచదేశాల పార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం బాగా పెరిగిందని ఐరాస వెల్లడించింది.

 
2020లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంటులలో మహిళలు 25 శాతం మంది ఉన్నారని తెలిపింది.అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై కమలా హారిస్ కూడా చరిత్ర సృష్టించారు. ఆ పదవి పొందిన మొట్టమొదటి బ్లాక్ ఉమన్‌గా, మొట్టమొదటి దక్షిణాసియా మూలాలున్న మహిళగా ఆమె రికార్డులకెక్కారు. ఈ ఏడాది జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించారు.

 
పర్యావరణానికీ 2020 మంచి సంవత్సరమనే చెప్పాలి. సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు కర్బన ఉద్గారాలు తగ్గించుకునేందుకు నిర్ణయించడం ఈ ఏడాది బాగా పెరిగింది. ఫేస్ బుక్, ఫోర్డ్, మెర్సిడెస్ బెంజ్ వంటి సంస్థలూ కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ముందుకొచ్చాయని ఐరాస తెలిపింది. అంతకుముందు అంచనా వేసిన దాని కంటే కూడా చంద్రునిపై ఇంకా ఎక్కువ నీరుందని నాసా తెలిపింది ఈ ఏడాదే.